నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కలయికలో రూపొందిన ‘శివ’ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా ద్వారా ఇండియన్ సినిమాకే కొత్త దిశ చూపించాడు ఆర్జీవీ. ఇప్పుడు ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం 35 ఏళ్ల తర్వాత మళ్లీ రీ-రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, ఆర్జీవీ ఇద్దరూ కలిసి సినిమా ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు.
ఇటీవల ఆర్జీవీ చేసిన ఒక ట్వీట్ నెట్‌లో వైరల్ అయింది. ఆయన ‘శివ’ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మ ఆనంద్ అకోజు గురించి గుర్తుచేసుకున్నారు. సినిమాలో మురళీ మోహన్ కూతురుగా నటించిన సుష్మ, నాగార్జున పాత్రకు “బాబాయ్” అంటూ వెనుక తిరుగుతూ కనిపిస్తుంది. నాగార్జునతో కలిసి తీసిన సైకిల్ ఛేజ్ సీన్ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
విలన్స్ వెంటపడే సీన్‌లో నాగార్జున ఆ చిన్నారిని సైకిల్‌పై కూర్చోబెట్టి తప్పించుకునే ఆ సన్నివేశం అప్పుడు హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత ఆ చిన్నారి ఎక్కడుందో, ఏమి చేస్తుందో అన్నది ఆర్జీవీ స్వయంగా వెల్లడించారు. ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్‌లో సుష్మ ప్రస్తుత ఫోటోను షేర్ చేస్తూ,
“శివ సినిమాలో భయంతో కనిపించిన ఆ చిన్నారి సుష్మ ఇప్పుడు అమెరికాలో AI & Cognitive Science లో రీసెర్చ్ చేస్తోంది” అని రాశారు.
దానికి సుష్మ కూడా స్పందిస్తూ,
“ధన్యవాదాలు సర్! శివ సినిమా లెగసీలో నన్ను గుర్తుంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు ఆ సినిమా అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను. నాగార్జున గారికి రీ రిలీజ్‌కి ఆల్ ది బెస్ట్!” అంటూ రీట్వీట్ చేసింది.
తెలుగు అమ్మాయి అయిన సుష్మ ఆనంద్ అకోజు ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా రీసెర్చ్, సైన్స్ సంబంధిత పోస్టులనే షేర్ చేస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్‌లో ఉండడంతో, ఇప్పుడు నెటిజన్లు ఆమె గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు, 35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న ‘శివ’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు సిద్ధంగా ఉంది. ఆ కాలానికి తగ్గట్లుగా రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 35 ఏళ్ల ‘శివ’ జ్ఞాపకాలు మళ్లీ తెరపైకి రావడం అభిమానులకు పండగలా మారింది.

