శీతాకాలం వచ్చిందంటే మార్కెట్లో చిలగడదుంపలు (Sweet Potatoes) విరివిగా లభిస్తాయి. రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దుంపలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో పొందాలంటే.. వాటిని సరైన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. ప్రముఖ పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిలగడదుంపలను ఎలా తింటే అవి మన శరీరానికి సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తాయో చెబుతున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చిలగడదుంప తినడానికి సరైన పద్ధతి:
కాల్చడం కంటే ఉడికించాలి : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిలగడదుంపలను కాల్చడం కంటే ఉడికించడం ఉత్తమం. ఉడికించినప్పుడు.. అందులోని చక్కెర కొంతవరకు నీటిలోకి విడుదలవుతుంది. దీనివల్ల దాని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా మారుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
చల్లారిన తర్వాత తినండి : ఉడికించిన చిలగడదుంపలు కొద్దిగా చల్లారిన తర్వాత తినాలి. అవి చల్లబడినప్పుడు వాటిలో నిరోధక పిండిపదార్థం (Resistant Starch) ఏర్పడుతుంది. ఇది ఒక రకమైన ఫైబర్‌గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గించి.. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గడానికి కూడా తోడ్పడుతుంది.
తొక్కతో సహా తినండి : చాలామంది తొక్క తీసేసి తింటారు. కానీ తొక్కలో సుమారు 30% ఎక్కువ ఫైబర్, రెట్టింపు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తొక్క జీర్ణక్రియను బలోపేతం చేసి శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. అయితే తినే ముందు దుంపలను శుభ్రంగా కడగడం తప్పనిసరి.
ఆరోగ్యకరమైన కొవ్వులు : చిలగడదుంపల్లో ఉండే బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ A గా మారుతుంది. ఇది చర్మం, కళ్లు, రోగనిరోధక వ్యవస్థకు చాలా మంచిది. విటమిన్ A కొవ్వులో కరిగే (Fat-soluble) పోషకం కాబట్టి.. దాని శోషణ కోసం కొద్దిగా నెయ్యి, వేరుశెనగలు, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తినాలి. దీనివల్ల పోషకాల శోషణ 6 రెట్లు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
అయితే చిలగడదుంపలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు లేదా IBS ఉన్నవారు తొక్కను పూర్తిగా తీసేయవచ్చు. పోషకాలు నశించకుండా ఉండటానికి వాటిని వేయించడం, లేదా మళ్లీ కాల్చడం మానుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు ఒకేసారి 100-120 గ్రాముల ఉడికించిన చిలగడదుంపలను మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

