2018 పంచాయతీరాజ్ చట్టాన్ని కాపాడాలి.. ఉపసర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తే ఊరుకోం: ‘చలో హైదరాబాద్’కు పిలుపు”

హైదరాబాద్: తెలంగాణలో ఉపసర్పంచులకు 2018 పంచాయతీరాజ్ చట్టం ద్వారా కల్పించిన చెక్ పవర్‌ను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపసర్పంచుల్లో ఆందోళన మరింత పెరిగింది. తమ హక్కులను హరించే ఎలాంటి నిర్ణయాన్నైనా వ్యతిరేకిస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉపసర్పంచుల సంఘం హెచ్చరించింది.

రాష్ట్ర ఉపసర్పంచుల సంఘం నాయకులు మాట్లాడుతూ, “మనం ఎన్నికైన కొద్ది రోజులకే చెక్ పవర్ రద్దుపై వార్తలు వచ్చాయి. అవి అసత్యమని ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ముప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా ఈ ప్రచారం వెనుక వాస్తవం ఉందనే అనుమానంతోనే మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నాం” అని తెలిపారు.

2018 చట్టం ప్రకారమే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు

2018లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉపసర్పంచులకు కల్పించిన అధికారాలు, హక్కుల ఆధారంగానే తాము ఎన్నికల్లో పోటీ చేశామని నాయకులు గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రజలు తమను ఎన్నుకున్నారని, ఇప్పుడు ఆ హక్కులను తొలగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

మేము గెలిచింది 2018 చట్టం ప్రకారం. ఎన్నికలకు ముందు ఉన్న హక్కులను చూపించి ప్రజల మద్దతు పొందాం. ఇప్పుడు ఆ హక్కులను తొలగించడం అంటే ప్రజల తీర్పును అవమానించడం” అని వారు అన్నారు.

ప్రభుత్వ మౌనంపై ఆగ్రహం

ఉపసర్పంచుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన రాకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ఇంతమంది ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. అయితే మేము వెనక్కి తగ్గేది లేదు. శాంతియుతంగా మా హక్కుల కోసం పోరాడతాం” అని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం

తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ప్రజలు శాంతియుతంగా పోరాడి తమ హక్కులను సాధించుకున్నారని గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో ఉపసర్పంచుల హక్కుల కోసం కూడా ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.

“ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే మా హక్కులను సాధించుకుంటాం” అని పేర్కొన్నారు.

డబ్బు కోసం కాదు.. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చాం

ఉపసర్పంచులుగా ఎన్నికల్లో పోటీ చేసింది డబ్బు కోసం కాదని, గ్రామాలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు.

“గ్రామాలకు అభివృద్ధి తీసుకురావాలి, ప్రజల్లో మంచి పేరు సంపాదించాలి అనే ఆలోచనతో పోటీ చేశాం. మా హక్కులను కాలరాయొద్దు” అని ప్రభుత్వాన్ని కోరారు.

‘చలో హైదరాబాద్’కు భారీగా తరలిరావాలని పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపసర్పంచులందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని సంఘం పిలుపునిచ్చింది. మొత్తం 12,700 మంది ఉపసర్పంచుల్లో కనీసం 10 వేల మందికి పైగా ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా, మండల నాయకులకు సూచించింది.

ప్రతి ఉపసర్పంచ్ తన బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరింది.

అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరిన ఉపసర్పంచులు

ఈ పోరాటానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల మద్దతు అవసరమని ఉపసర్పంచుల సంఘం పేర్కొంది.

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు మా తరఫున గొంతు విప్పాలి. రేపు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొని మా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి” అని విజ్ఞప్తి చేశారు.

సర్పంచ్‌లతో విభేదాలు లేవు

ఈ అంశాన్ని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల మధ్య గొడవగా చిత్రీకరించడం సరికాదని సంఘం స్పష్టం చేసింది.

“మాకు సర్పంచ్‌లతో ఎలాంటి విభేదాలు లేవు. కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ అపోహలు సృష్టిస్తున్నారు. దయచేసి దీనిని రాజకీయ కోణంలో చూడొద్దు” అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి, హెచ్చరిక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై వెంటనే స్పందించి, 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉపసర్పంచులకు ఉన్న హక్కులను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచులు డిమాండ్ చేశారు.

“మా ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల హక్కులను కాపాడాలని, గ్రామాభివృద్ధిలో ఉపసర్పంచుల పాత్రను గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *