ఇటీవలి కాలంలో మహిళల్లో ఊబకాయం (Obesity), వెయిట్ గెయిన్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు అధికంగా తినడం, వ్యాయామం చేయకపోవడమే ప్రధాన కారణాలుగా భావించేవారు. కానీ ఇప్పుడు హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance) కూడా వెయిట్ పెరగడానికి ముఖ్య కారణంగా మారుతోంది. అసలు హార్మోన్లకు బరువు పెరగడానికి ఉన్న సంబంధం ఏమిటి? హోమియోపతి దీనిలో ఎలా సహాయపడుతుంది? అనే విషయాలను పీడిక్ హోమియోపతీకి చెందిన డాక్టర్ తేజస్వి వివరించారు.
మహిళల శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్, థైరాయిడ్ హార్మోన్లు, ఇన్సులిన్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వంటి అనేక హార్మోన్లు శరీరంలోని ప్రతి అవయవం పనితీరును నియంత్రిస్తాయి. ఈ హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తే మెటబాలిజం సక్రమంగా కొనసాగుతుంది. కానీ వీటిలో ఏదైనా అసమతుల్యత ఏర్పడితే శరీరంలో కొవ్వు నిల్వ పెరిగి బరువు పెరగడం ప్రారంభమవుతుంది.
డాక్టర్ తేజస్వి తెలిపిన ప్రకారం పీసీఓఎస్ (PCOS), హైపోథైరాయిడిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెనోపాజ్ తర్వాతి దశ, హార్మోన్ టాబ్లెట్లు లేదా కాంట్రాసెప్టివ్ పిల్స్ వినియోగం, అలాగే నిరంతర ఒత్తిడి (Stress) వంటి పరిస్థితుల్లో వెయిట్ గెయిన్ ఎక్కువగా కనిపిస్తుంది.
చాలామంది “మేము చాలా తక్కువ తింటాం… అయినా బరువు పెరుగుతోంది” అని చెబుతుంటారు. అలాంటి సందర్భాల్లో కేవలం ఆహారం కారణం కాకుండా హార్మోన్ల అసమతుల్యత కూడా ప్రధాన కారణంగా ఉండొచ్చని ఆమె చెప్పారు.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిలో తిన్న ఆహారం శక్తిగా మారకుండా శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతుంది. ముఖ్యంగా పొత్తికడుపు, తొడలు, నడుము భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీని వల్ల క్రమంగా పీసీఓఎస్, హార్మోన్ల అసమతుల్యత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అలాగే ప్రస్తుత జీవనశైలి కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. అధిక కార్బోహైడ్రేట్లు, మైదా పదార్థాలు, జంక్ ఫుడ్, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర మానసిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి మిగతా హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుంది. దీని ప్రభావంగా వెయిట్ గెయిన్, పీరియడ్స్ సమస్యలు, పీసీఓఎస్ వంటి సమస్యలు కనిపిస్తాయి.
మెనోపాజ్ తర్వాత సహజంగానే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడంతో మెటబాలిజం మందగిస్తుంది. దీనివల్ల కూడా బరువు పెరగడం, అలసట, మోకాళ్ల నొప్పులు, బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయని ఆమె తెలిపారు.
చాలామంది వెయిట్ తగ్గించుకోవడానికి డైట్, జిమ్, సప్లిమెంట్స్, వెయిట్ లాస్ మాత్రలపై మాత్రమే దృష్టి పెడతారని, కానీ అసలు కారణమైన హార్మోన్ల అసమతుల్యతను గుర్తించకుండా చికిత్స తీసుకుంటే ఆశించిన ఫలితాలు రావని డాక్టర్ తేజస్వి పేర్కొన్నారు.
హోమియోపతీలో కేవలం బరువు తగ్గించే మందులు ఇవ్వడం కాదని, ముందుగా రోగి పూర్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారని ఆమె వివరించారు. పీరియడ్స్ సమస్యలు, మానసిక పరిస్థితి, కుటుంబ వైద్య చరిత్ర, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఇతర లక్షణాలన్నింటినీ విశ్లేషించి అసలు కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తామని చెప్పారు.
హోమియోపతీలో హార్మోన్ టాబ్లెట్లు ఇవ్వడం జరగదని, శరీరం సహజంగానే హార్మోన్లను సమతుల్యం చేసుకునే విధంగా చికిత్స అందిస్తామని ఆమె తెలిపారు. ప్రతి వ్యక్తికి వారి లక్షణాల ఆధారంగా వ్యక్తిగత (Individualized) చికిత్స ఇస్తారని, అందరికీ ఒకే మందులు ఇవ్వబోవని స్పష్టం చేశారు.
చికిత్సతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్, అవసరమైన హార్మోన్ పరీక్షలు, బ్లడ్ టెస్టులు, అవసరమైతే స్కానింగ్ ద్వారా పురోగతిని పరిశీలిస్తామని చెప్పారు.
హోమియోపతి మందులకు సాధారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, చాలా అరుదుగా మందు సరిపోకపోతే తాత్కాలిక లక్షణాలు కనిపించవచ్చని, అవి మందు ఆపితే తగ్గిపోతాయని తెలిపారు. డయాబెటిస్, బీపీ వంటి ఇతర వ్యాధుల మందులతో పాటు కూడా అవసరమైతే హోమియోపతి చికిత్స తీసుకోవచ్చని చెప్పారు.
రోజువారీ జీవితంలో బరువు నియంత్రణ కోసం కార్బోహైడ్రేట్లు, మైదా పదార్థాలు తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సరైన నిద్ర, ఒత్తిడిని తగ్గించడం కూడా హార్మోన్ల సమతుల్యతకు ఎంతో అవసరమని వివరించారు.
మొత్తానికి మహిళల్లో వెయిట్ గెయిన్ అనేది కేవలం అధిక ఆహారం వల్లే కాదు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా రావచ్చు. కాబట్టి దీర్ఘకాలంగా బరువు పెరగడం, పీరియడ్స్ సమస్యలు, పీసీఓఎస్, థైరాయిడ్ వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమమని డాక్టర్ తేజస్వి సూచించారు.

