తెలంగాణలో ఉపఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మాజీ క్రికెటర్, ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు.
ఈ నిర్ణయం ఉపఎన్నికల నేపథ్యంలో వెలువడటం రాజకీయ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ, అజారుద్దీన్‌పై వివిధ కేసులు పెండింగ్‌లో ఉండగా మంత్రి పదవి ఇవ్వడం చట్ట విరుద్ధమని ఆరోపిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఇటువంటి నియామకం ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నదని వారు అభిప్రాయపడుతున్నారు.
వాస్వతానికి, జూబిలీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్ పాత్ర ప్రాధాన్యం సంతరించుకున్నది. గతంలో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన విధానం కేవలం రాజకీయ లెక్కలేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆయనను ప్రచారంలోకి తీసుకురావడమే లక్ష్యమని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, అజారుద్దీన్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనకపోవడంతో, ఆయనను ప్రోత్సహించేందుకు మరియు మైనారిటీ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే మైనారిటీ ఓట్లు ఇప్పటికే కాంగ్రెస్ వైపే ఉన్నాయని భావిస్తుండటంతో ఈ నిర్ణయం విజయసాధనలో ఎంతవరకు దోహదం చేస్తుందో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపధ్యంలో గవర్నర్, ప్రభుత్వ జట్టు వ్యవహార శైలి కూడా చర్చనీయాంశం అవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పట్ల పెండింగ్ అంశాలు ఉన్నప్పటికీ, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం విషయంలో వేగంగా ముందుకు సాగడం ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవదీస్తోంది. అదే సమయంలో గవర్నర్ వ్యవహారాన్ని కూడా ప్రజలు విశ్లేషిస్తున్నారు.
మొత్తం మీద, అజారుద్దీన్ ప్రమాణం వేడుక కంటే, దానిపై ఉన్న రాజకీయ మంటలు ఎక్కువగా రగులుతున్నాయి. ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత కూడా ఈ వివాదం రాజకీయ చర్చల్లో కొనసాగే అవకాశముంది.

