ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో రాష్ట్రంలో బీసీ రాజకీయ చైతన్యం పెరుగుతోందని నాయకులు తెలిపారు. సంస్థ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్, వైస్ చైర్మన్ దుర్గేయ గౌడ్, కన్వీనర్లు ఐలి వెంకన్న, అంబాల నారాయణ, అలాగే బీసీ జనచైన్యం అధ్యక్షుడు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో బీసీల రాజకీయ అవగాహన పెరుగుతోందని సూచిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. సమాజంలో ఉన్న జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ అధికారంలో కూడా వాటా రావాలన్న డిమాండ్‌తో బీసీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.
42% రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించినా బీసీలు సాధారణ స్థానాల్లోనే గెలుపొందిన విషయాన్ని నాయకులు ప్రస్తావించారు. ఇది బీసీ చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే ఎంపిటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అదే సమయంలో బీసీ సంక్షేమానికి కేటాయించాల్సిన నిధులు పూర్తిగా వినియోగం కావడం లేదని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉన్నా అమలు జరగలేదని విమర్శించారు. విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్ట్ రంగాల్లో కూడా తగిన రిజర్వేషన్లు అమలు కావడం లేదని అన్నారు.
బడ్జెట్‌లో బీసీలకు రావాల్సిన వాటా కేటాయించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే “చలో అసెంబ్లీ” కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.
రాజకీయంగా బీసీలు స్వతంత్ర శక్తిగా ఎదగాలని, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు తమ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఏకమవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాబోయే ఎన్నికల్లో మరింత ఐక్యతతో ముందుకు వచ్చి అధిక శాతం స్థానాలు గెలుచుకోవాలని బీసీ సమాజానికి నాయకులు పిలుపునిచ్చారు. “సామాజిక న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.

