ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ 2047కు గ్లోబల్ టెండర్లు… 9 నెలల్లో సమగ్ర ప్రణాళిక సిద్ధం లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. సమగ్ర మాస్టర్ ప్లాన్ 2047 రూపకల్పన కోసం గ్లోబల్ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రణాళికను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్ నగర శివార్లలో విస్తరించే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేశారు. అమంగల్, ఇబ్రహింపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల పరిధిలోని 74 గ్రామ పంచాయతీలు, 56 రెవెన్యూ గ్రామాలు కలిపి మొత్తం 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది.

మొత్తం 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించగా, ఇప్పటికే సుమారు 15 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మరో 15 వేల ఎకరాల్లో సఫారీ, ఎకో టూరిజం పార్కులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కోర్ ప్రాంతం 30 వేల ఎకరాల్లో ప్రాథమిక మాస్టర్ ప్లాన్ మరియు డీపీఆర్ తయారీ బాధ్యతలను సింగపూర్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సుర్బాన జురాంగ్ కు అప్పగించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం సింగపూర్ లో ఉంది.

ఇప్పుడు మొత్తం ఫ్యూచర్ సిటీ పరిధికి సంబంధించిన సమగ్ర విజన్ డాక్యుమెంట్, మాస్టర్ ప్లాన్ 2047 రూపొందించేందుకు అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ప్రభుత్వం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25 వరకు టెండర్ డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. సాంకేతిక, ఆర్థిక బిడ్ల సమర్పణకు మార్చ్ 12 సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్ణయించారు. బిడ్లు మార్చ్ 16న తెరవనున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది.

నిర్ణీత గడువులో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి అమల్లోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ పట్టణాభివృద్ధి దిశగా కొత్త మైలురాయిని చేరాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *