42% బీసీ రిజర్వేషన్ ఎందుకు ఆలస్యం? కోర్టు అడ్డంకులా.. రాజకీయ లెక్కలా?

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో, నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతోందన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఇది కోర్టు ప్రక్రియ వల్ల జరిగే ఆలస్యమా? లేక రాజకీయ కారణాలే ప్రధాన కారణమా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వాలు బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని విమర్శలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరమైన హామీలు ఉన్నప్పటికీ, బీసీల విషయంలో రాష్ట్రాల ఇష్టానికి వదిలేయడం వల్ల అన్యాయం జరిగిందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే ఎజెండాతో ముందుకు వెళ్లిందని చెబుతున్నారు.

42 శాతం రిజర్వేషన్ నిర్ణయానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన నిర్వహించిందని, డోర్ టు డోర్ సర్వే ద్వారా జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన నివేదిక సిద్ధం చేసిందని ప్రభుత్వం వాదిస్తోంది. పెరిగిన జనాభా, పెరిగిన పోటీకి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా పెరగాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి.

అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన ఇంద్రా సాహ్నీ తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన ప్రధాన అడ్డంకిగా మారింది. దీనిని అధిగమించేందుకు తమిళనాడు తరహాలో నైన్త్ షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. కానీ ఇందుకు కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ మద్దతు అవసరమవుతుండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది.

ప్రభుత్వం చేసిన సర్వేలో ఎలాంటి లోపాలు లేవని, చివరి దశలో కొందరు స్వలాభాల కోసం కోర్టును ఆశ్రయించారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రాష్ట్రం నుంచి కేంద్రం వరకు రాజకీయ సంకల్పం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం సామాజిక న్యాయ పోరాటంగా మారింది. కోర్టు తీర్పు, కేంద్రం నిర్ణయాలపై ఈ కీలక అంశం భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *