స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ అక్కడ కూడా పెద్దగా పురోగతి కనిపించడం లేదు.
బీసీలు ఆశతో ఉన్నారు — ప్రభుత్వం హామీ నెరవేర్చుతుందనుకున్నారు. కానీ హైకోర్టు కేసు నిలిచిపోవడంతో, బీసీ నేతలు రోజూ ప్రెస్ మీట్లు, ధర్నాలు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు.
బివి రాఘవులు మాట్లాడుతూ,
“బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే పార్లమెంటులో 50% పరిమితిని ఎత్తివేసే బిల్లు పెట్టాలి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ తీసుకురావాలి” అన్నారు.
అలాగే బిజెపి అసెంబ్లీలో మద్దతు ఇచ్చి, కేంద్రంలో అడ్డుకుంటూ మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.ఆర్. కృష్ణయ్య కూడా తీవ్రస్థాయిలో స్పందిస్తూ,
“కాంగ్రెస్ పార్టీ పరంగా కాదు, చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. లేకుంటే బీసీల తిరుగుబాటు తప్పదు,”
అని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.మరోవైపు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న లేఖలు, ఫైళ్ళు ఇంకా క్లియర్ కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు “మేము లేఖ రాశాం, గవర్నర్ స్పందించడం లేదు” అంటుంటే, ప్రజలు మాత్రం “మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు” అని ప్రశ్నిస్తున్నారు.
42% రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వానికి చట్టబద్ధత అవసరమని నిపుణులు చెబుతున్నారు. నైన్ షెడ్యూల్‌లో చేర్చడం, లేకపోతే కొత్త జీవో తీసుకురావడం వంటి అంశాలు ఇంకా స్పష్టత లేకుండా ఉన్నాయి.
ఇక బీసీలు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు:
మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చండి. మేము మీకు మద్దతు ఇచ్చాం, ఇప్పుడు మీరు మాకు న్యాయం చేయాలి.”
జీవో నెంబర్ 9 విషయానికొస్తే, దానికి చట్టబద్ధత లేదని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు కీలకం కానుంది.
రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం,
ఈ వ్యవహారం త్వరలో తేలే అవకాశం కనిపించడం లేదు. ఇది “తెగని పంచాయతీ”గా మారింది. ఒకవైపు కోర్టు, మరోవైపు రాజకీయ వ్యూహాలు – మధ్యలో బీసీలు న్యాయం కోసం వేచి చూస్తున్నారు.

