లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు?—సామల హేమ తీవ్ర అభ్యంతరం

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ముందుగా ప్రకటించిన ప్రభుత్వం, తాజా సమాచార ప్రకారం వాటిని 23%కి పరిమితం చేయనున్నట్లు సంకేతాలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ మీడియాతో మాట్లాడారు.

ఆమె మాట్లాడుతూ—ప్రభుత్వానికి ఇది ముందే తెలిసిన అంశం అని, ఇంటెలెక్చువల్స్ నుంచి ప్రభుత్వానికి ఈ నిర్ణయం కోర్టులో నిలదీయబడదని స్పష్టమైన సూచనలు వచ్చాయని చెప్పారు. అయినప్పటికీ బీసీ సమాజాన్ని గందరగోళంలో ఉంచి, ఎన్నికల నాటకానికి దిగారని ఆరోపించారు.

కామారెడ్డి డిక్లరేషన్ సమయంలో “42% రిజర్వేషన్లు వెంటనే ఇస్తాం, కులగణన చేస్తాం” అని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, ఆ మాటలు నమ్మి బీసీలు పెద్దఎత్తున మద్దతు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.

అయితే కులగణనను కూడా ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదని హేమ వ్యాఖ్యానించారు. “ప్రజల కులం, ఉపాధి సమాచారమే కావాలి గాని ఏసీ ఉందా? ఫ్రిడ్జ్ ఉందా? అప్పు ఎంత? అనే ప్రశ్నలకు సంబంధం ఏమిటి?” అని ఆమె ప్రశ్నించారు. ఈ కారణంగా చాలా మంది పాల్గొనలేదని ఆమె తెలిపారు.

ఇక లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం కోర్టు ఒత్తిడితో ఇప్పుడు 23% రిజర్వేషన్ ప్రతిపాదన తీసుకువస్తోందని, ఇది బీసీ సమాజంపై అన్యాయం అని సామల హేమ వాదించారు. “42% ప్రామిస్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకుంటే, బీసీలు అంగీకరించరు,” అని చెప్పారు.

అలాగే GHMC ఎన్నికల్లో కూడా ఇదే శాతం అమలవుతుందని భావిస్తే, ఇది బీసీ నాయకులకు మరింత నష్టం చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంలో న్యాయం కోసం కోర్టు మార్గంలోనూ పోరాడతామని తెలిపారు.

బీసీలకు వాగ్దానం చేసిన రిజర్వేషన్లు, బడ్జెట్ హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఉద్యమం ప్రారంభిస్తామని ఆమె హెచ్చరించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీపై కూడా హేమ స్పందించారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు పండగ సందర్భానికే సమయానుకూలంగా, చేనేత చీరలను అందించినట్లు ఆమె గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రకటించినప్పటికీ మహిళలకు చీరలు చేరడం లేదని, కేవలం కొద్దిమందికి మాత్రమే పంపిణీ జరుగుతోందని ఆమె విమర్శించారు.

ఇక 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం పెండింగ్‌లో ఉండటం, కోర్టు గమనికలతో బైఎలక్షన్లు తప్పవని ఆమె అభిప్రాయపడ్డారు. బైఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలుస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *