తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరిట జరిగిన దోపిడీపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ పార్కులు నిజమైన ఉత్పత్తి కేంద్రాలుగా రూపుదిద్దుకోవాల్సింది పోయి వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోయాయి. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో కర్మాగారాలు కాకుండా కార్ షోరూమ్లు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్మించడం సాధారణమైపోయింది.
జాన్సన్ గ్రామర్, శ్రీ చైతన్య వంటి విద్యాసంస్థలు కూడా పారిశ్రామిక జోన్లలో కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే అక్రమ మార్పులను గుర్తించిన టిజిఐ (TGIIA) అధికారులు కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చినా, తదుపరి చర్యలు లేకుండా విషయాన్ని వదిలేశారు.
10 ఏళ్లుగా జరుగుతున్న ఈ దందా వెనుక రాజకీయ నాయకులు, అధికారులే ఉన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో భూములు పొందిన అనేక కంపెనీలు అసలు ఉత్పత్తి లేకుండా ప్లాట్లను లీజ్‌కి ఇవ్వడం, కమర్షియల్ రేంట్స్ తీసుకోవడం, భూముల విలువలు పెరిగే వరకు ఖాళీగా ఉంచడం వంటి అక్రమాలు జరగడంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం నష్టమైందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
అయితే పరిస్థితి ఇప్పుడు కూడా మారలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పదవిలో ఉన్నప్పటికీ పారిశ్రామిక భూముల దుర్వినియోగం కొనసాగుతోందని ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇప్పుడైతే ఇండస్ట్రియల్ ఏరియాలను అవుట్‌స్కర్ట్స్‌లోని ఆర్ఆర్ఆర్ ప్రాంతాలకు మార్చి, ప్రస్తుత పారిశ్రామిక వాడలను కమర్షియల్ రియల్ ఎస్టేట్‌గా అభివృద్ధి చేయాలనే లాబ్బీ బలపడుతోందని సమాచారం.
ఈ మార్పుల ద్వారా మాత్రమే సుమారు ₹5 లక్షల కోట్ల విలువైన భూములపై ప్రబల లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే ఈ లాభాలు ప్రజలకు కాకుండా, కొద్దిమంది కీలక రాజకీయ నాయకులు మరియు రియల్ ఎస్టేట్ మాఫియాలకు చేరతాయని ఆరోపణలు ఉన్నాయి.
విమర్శకుల మాటల్లో —
“పరిశ్రమల పేరిట భూములు తీసుకుని, వ్యాపారాలు చేసేది ప్రజల కోసం కాదు. రాజకీయ నాయకులకూ, రియల్ ఎస్టేట్ మాఫియాకు మాత్రమే లాభం.”
పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల ప్రజా భూముల దోపిడీ జరిగిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమైన దర్యాప్తు చేపట్టాలంటూ సామాజిక సంస్థలు, పరిశ్రమ సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

