బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, కేటాయించిన బడ్జెట్ అమలుపై ఎలాంటి అన్యాయం జరగదని ప్రభుత్వం సభలో స్పష్టత ఇచ్చింది. బలహీన వర్గాలకు సంబంధించి రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పటివరకు సుమారు రూ.2400 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని, మిగిలిన నిధుల వినియోగానికి అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
విదేశీ విద్య పథకానికి సంబంధించి గత ప్రభుత్వాల హయాంలో కేవలం 300 మందికే అవకాశం ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం దానిని 700కు పెంచిందని వెల్లడించారు. ఉపముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విదేశీ విద్యను ఒక పెట్టుబడిగా భావించి, బలహీన వర్గాల కుటుంబాలు దీని ద్వారా భవిష్యత్తులో బలపడతాయని ప్రభుత్వం విశ్వసిస్తోందని చెప్పారు.
విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 నియోజకవర్గాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకుల హాస్టల్స్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు విడివిడిగా హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొత్తం మీద బీసీ వర్గాలకు సంబంధించిన హాస్టల్ నిర్మాణాలకే రూ.5000 కోట్లకు పైగా ఖర్చు జరుగుతోందని వెల్లడించారు.
అలాగే బీసీ కార్పొరేషన్లు, కులవృత్తులకు మద్దతుగా రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని, అప్లికేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత కొంత జాప్యం జరిగినప్పటికీ అర్హులైన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.
కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి ఎలాంటి పెండింగ్ లేదని, ఎమ్మెల్యేల సంతకాలతో దరఖాస్తులు వచ్చిన వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గతంలో ఉన్న బకాయిల సమస్యలు పూర్తిగా పరిష్కరించామని, ప్రస్తుతం త్రైమాసికంగా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు.
కుల సర్వే ఆధారంగా నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని, అన్ని పథకాల మూలం విద్యే అన్న ఆలోచనతో గురుకుల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.
మొత్తంగా బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, త్వరలో ప్రత్యేక ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి నిధుల వినియోగం, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తామని హామీ ఇచ్చింది.

