అమెరికాతో ‘ది బెస్ట్ డీల్’నా..? ట్రంప్ ఒత్తిడికి తలగ్గిన ఒప్పందమా..? భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై రాజకీయ దుమారం

భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారి తీసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని “పొరుగు ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే భారత్‌కు దక్కిన అత్యుత్తమ డీల్”గా అభివర్ణించారు. వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ కల్పించామని, టెక్స్టైల్స్, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులకు ఈ డీల్ ద్వారా లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న స్నేహ సంబంధాలే ఈ ఒప్పందానికి ప్రధాన కారణమని పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఒత్తిడికి లోనవకుండా, భారత ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఈ డీల్ కుదిరిందని ఆయన తెలిపారు.

అయితే ఈ ఒప్పందంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ట్రంప్ ఒత్తిడికి తలగ్గే ప్రధాని మోదీ ఈ ఒప్పందంపై సంతకం చేశారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ప్రయోజనాల కంటే బాహ్య ఒత్తిళ్లకే పెద్దపీట వేశారని విమర్శించారు.

ప్రధానంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఒకవైపు ట్రేడ్ డీల్‌లు కుదుర్చుకుంటూనే, మరోవైపు అమెరికాలో భారతీయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్-1బీ వీసాలు, విద్యార్థుల వీసాలపై ఆంక్షలు పెరగడం వల్ల భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శకులు అంటున్నారు.

ఇక విద్యార్థుల పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని, ఒకసారి చదువుకోడానికి వెళ్లిన తర్వాత తిరిగి రావడం కష్టంగా మారిందని, కుటుంబ సభ్యులు వెళ్లి చూసే పరిస్థితి కూడా లేదని ప్రతిపక్షం పేర్కొంటోంది. ఇలాంటి అంశాలపై అమెరికాతో చర్చించి స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు రష్యా చమురు కొనుగోలుపై భారత్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించడం కొత్త చర్చకు తెరలేపింది. ఈ అంశాలన్నీ కలిపి చూస్తే, భారత్‌పై అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది.

రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి, కార్పొరేట్ కేసుల భయంతోనే ప్రభుత్వం ఈ డీల్‌కు ఒప్పుకుందన్న ఆరోపణలు చేశారు. భారతాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నమే ఈ ఒప్పందమని ఆయన వ్యాఖ్యానించారు.

మొత్తానికి, భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ఇప్పుడు కేవలం ఆర్థిక అంశంగానే కాకుండా, జాతీయ ప్రయోజనాలు, విదేశాల్లో భారతీయుల భద్రత, సార్వభౌమత్వం వంటి అంశాలపై పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఈ అంశాలపై మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *