ప్రతిపక్ష గొంతు నొక్కేలా శాసనసభ నడుస్తోంది – స్పీకర్, సీఎం వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ బహిష్కరణ

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు శాసనసభలో వినిపించాలని ఆశతో ఎదురు చూస్తుంటారని, ఆ బాధ్యతను ప్రతిపక్షం ద్వారా నెరవేర్చాలని అనేక వర్గాల ప్రజలు వినతులు ఇస్తుంటారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. అయితే ప్రజల గొంతును అసెంబ్లీలో ప్రతిధ్వనింపజేయాల్సిన శాసనసభ రోజు రోజుకు దిగజారిపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలో పక్క రాష్ట్రాల శాసనసభల తీరును చూసి మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తోందని గర్వపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష గొంతు నొక్కుతూ అధికార పక్షం నిరంకుశ ధోరణిలో సభను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపించింది.

భారతదేశ శాసనసభల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, స్పీకర్ మౌన ప్రేక్షకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. గత సమావేశాల్లో విలేకరులపై చేసిన వ్యాఖ్యలను కూడా స్పీకర్ ఖండించలేకపోయారని, వాటిని రికార్డుల నుంచి తొలగించలేకపోయారని పేర్కొన్నారు.

ఈరోజు సభలో పరిస్థితి మరింత దిగజారిందని బీఆర్ఎస్ తెలిపింది. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వనని స్పీకర్ బహిరంగంగా హెచ్చరించడం శాసనసభ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఆరోపించారు. స్పీకర్ పాత్ర ప్రతిపక్షాన్ని రక్షించాల్సినదే కానీ, ప్రభుత్వ పక్షానికి రక్షణగా నిలవడం కాదని స్పష్టం చేశారు.

క్వశ్చన్ అవర్ సందర్భంగా ఒకే ప్రశ్నపై గంటల తరబడి ముఖ్యమంత్రి మాట్లాడడం చరిత్రలో లేనిదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నకు సంక్షిప్త సమాధానం ఇవ్వాల్సిన బదులు, ముఖ్యమంత్రి రాజకీయ దాడులకు వేదికగా అసెంబ్లీని మార్చారని విమర్శించారు.

మూసీ అంశంపై ప్రతిపక్షం పద్ధతిగా ప్రశ్నలు అడిగినా, ముఖ్యమంత్రి దాడి ధోరణితో మాట్లాడారని, అనంతరం బీఆర్ఎస్ ఉపనాయకులు సవితా ఇంద్రా రెడ్డి, సునీత లక్ష్మణ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి సీనియర్ నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేశారని పేర్కొన్నారు. చివరికి హరీష్ రావుకు అవకాశం ఇచ్చినా, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే మైక్ కట్ చేస్తామని చెప్పడం ప్రజాస్వామ్యంపై దాడేనని అన్నారు.

ప్రతిపక్షం ముఖ్యమంత్రిని విమర్శించకుండా సభకు రావాలంటే ఎందుకని ప్రశ్నిస్తూ, ఇది ప్రజాస్వామ్యమేనా అనే సందేహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని పొగడడానికే ప్రతిపక్షం సభకు రావాలా అని నిలదీశారు.

సభను నిబంధనలేకుండా, ఇష్టారాజ్యంగా నడుపుతున్న స్పీకర్ వైఖరికి, ముఖ్యమంత్రి ఉపయోగించిన ఘోరమైన భాషకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. సభను నిబంధనల ప్రకారమే, అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ నడపాల్సిన బాధ్యతను స్పీకర్ మర్చిపోయారని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *