బిఆర్ఎస్‌లో కలకలం: కవిత వ్యాఖ్యలే కారణమా? కేసీఆర్ 21న తెలంగాణ భవన్‌కు ఎందుకు వస్తున్నారు?

బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సర్పంచులు, ఎమ్మెల్యేల విషయంలో పార్టీని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నా… వాస్తవంగా చూస్తే “కాపాడుకోవడానికి ఏముంది?” అనే ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అధికార పార్టీ ఎటు ఉంటే అటే వెళ్లే రాజకీయ పరిస్థితుల్లో, బిఆర్ఎస్‌లో ఉన్నామన్నా కూడా అధికారంతో సంబంధాలు లేకపోతే నిధులు రావడం కష్టమన్న వాస్తవాన్ని నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది.

ఇక పార్టీ భవిష్యత్తుపై స్వయంగా బిఆర్ఎస్‌కే డౌట్స్ మొదలయ్యాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అనే అనిశ్చితితో నియోజకవర్గాల బాట పట్టిన కేటీఆర్, హరీష్ రావు “ఎవరు భయపడొద్దు” అంటూ భరోసా ఇస్తున్నా… ఆ మాటలకు పార్టీ కేడర్‌లో మునుపటిలా నమ్మకం కనిపించడం లేదనే విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నెల 21న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారన్న సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ప్రశ్న ఏమిటంటే… ఇప్పటివరకు ఏ ప్రధాన ప్రజా సమస్యపై బయటికి రాని కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు బయటికి వస్తున్నారు? యూరియా కొరత, రైతు సమస్యలు, ఫుడ్ బజార్లు జరుగుతున్న సందర్భాల్లో కూడా కనీసం ఒక వీడియో సందేశం ఇవ్వని కేసీఆర్… ఇప్పుడు మాత్రం పార్టీ సమావేశానికి రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం, ఈ సమావేశానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేల జంపింగ్ కంటే… కవిత చేస్తున్న వ్యాఖ్యలే అని చెప్పాలి. కవిత మాట్లాడుతున్న తీరు, ఆమె బయటపెడుతున్న అంశాలు, ఆధారాలతో సహా చేస్తున్న ఆరోపణలు పార్టీకి తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు. ఇప్పటికే పలువురు నాయకుల పేర్లు బయటకు రావడంతో, ఎవరి గురించి ఎప్పుడు మాట్లాడతారో అన్న భయం నేతల్లో నెలకొంది. ఈ కారణంగానే ఎవరూ బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి స్పందించలేని పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు ఉన్నాయి.

కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికీ పార్టీ కోసం తిరుగుతున్నా… ప్రజల్లో వారికి ఉన్న ఇమేజ్ మాత్రం మునుపటిలా లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు వారు “ముఖ్య నేతలు”గా కాకుండా “ఒక నాయకులు”గా మాత్రమే కనిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్‌ను కొంతైనా ముందుకు తీసుకెళ్లాలంటే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి.

ఇక ఈ సమావేశంలో కేవలం అంతర్గత అంశాలే కాకుండా… భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బిజెపితో కలిసి వెళ్లాలా? అనే అంశం కూడా టేబుల్‌పైకి వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కొత్త పార్టీలు నిలదొక్కుకునే పరిస్థితి లేకపోవడం, జాతీయ పార్టీగా బిజెపి మాత్రమే బలంగా ఉండటం నేపథ్యంలో… బిఆర్ఎస్‌కు రాజకీయంగా “పోర్టు” అవసరమన్న అభిప్రాయం కూడా చర్చకు వస్తోంది.

మొత్తానికి, 21న జరిగే ఈ సమావేశం బిఆర్ఎస్ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? పార్టీ నేతలకు ఏ విధమైన దిశానిర్దేశం చేస్తారు? బిజెపీతో పొత్తుపై ఏమైనా స్పష్టత ఇస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ సమావేశం తర్వాతే బయటకు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *