ఈ మధ్యకాలంలో సినిమా విడుదలైన రెండో రోజుకే వంద కోట్ల కలెక్షన్ల పోస్టర్లు రావడం సర్వసాధారణంగా మారింది. అయితే ఈ నంబర్లు నిజమేనా? లేక కేవలం హైప్ కోసమేనా? అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. గతేడాది నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా విషయంలో కూడా ఇదే వివాదం తలెత్తింది. 100 కోట్ల పోస్టర్ పడగానే నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో నిర్మాత బన్నీ వాస్ ఒక ఇంటర్వ్యూలో ఈ కలెక్షన్ల గేమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తండేల్’ తన దృష్టిలో పూర్తిస్థాయి బ్లాక్ బస్టర్ అని స్పష్టం చేశారు. బయట జనాలు సూపర్ హిట్ అని అనుకోవచ్చు కానీ, పెట్టిన బడ్జెట్‌కు వచ్చిన రాబడిని చూస్తే అది బ్లాక్ బస్టర్ స్థాయి విజయం అని తెలిపారు. ఎక్కువ ఖర్చు పెట్టి, దాన్ని తిరిగి రాబట్టడం కూడా ఒక రకమైన మ్యాజిక్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
అందరిలో ఉన్న ప్రధాన సందేహం 100 కోట్ల ఫిగర్ ఎలా వచ్చిందనే విషయంపై బన్నీ వాస్ స్పష్టత ఇచ్చారు. ఇండియాలో ఈ సినిమా సుమారు 70–72 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని, మిగిలిన మొత్తం ఓవర్సీస్ మరియు ఇతర దేశాల నుంచి వచ్చిన కలెక్షన్లని చెప్పారు. సాధారణ ప్రేక్షకులు ఇండియా గ్రాస్ మాత్రమే చూస్తారని, కానీ నిర్మాతలు వరల్డ్ వైడ్ గ్రాస్‌ను లెక్కలోకి తీసుకుంటారని అసలు లాజిక్‌ను వివరించారు.
ఇక్కడే డాలర్ రేట్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఒకప్పుడు డాలర్ విలువ తక్కువగా ఉండడంతో 100 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు డాలర్ రేటు దాదాపు 90 రూపాయల దగ్గర ఉండటంతో ఓవర్సీస్‌లో సినిమా కొంచెం బాగానే ఆడినా వంద కోట్ల గ్రాస్ సాధ్యం అవుతోందని తెలిపారు. చైనా లాంటి దేశాల నుంచి వచ్చే రెవెన్యూ కలిస్తే ఈ నంబర్లు మరింత ఈజీ అవుతాయని చెప్పారు.
అయితే ఈ నంబర్లు ఎంతవరకు నిజమన్న ప్రశ్నకు బన్నీ వాస్ ఒక ఓపెన్ సీక్రెట్‌ను బయటపెట్టారు. ఏ నిర్మాతైనా సరే వచ్చిన కలెక్షన్లకు 5 నుంచి 10 శాతం వరకు అదనంగా చూపించడం ఇండస్ట్రీలో సాధారణమేనని, అది ఒక రకమైన ‘ఎన్హ్యాన్స్మెంట్’ అని నిజాయితీగా ఒప్పుకున్నారు. సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి తప్పవని ఆయన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

