కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ మిడిల్ క్లాస్, సామాన్య వర్గాలకు ఊరటనిచ్చేదిగా ఉందని రాజకీయ, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్మలా సీతారామన్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె ఎప్పుడూ ఒమ్ము చేయలేదన్న అభిప్రాయం బలపడుతోంది.
భారతదేశ ఆర్థిక పునాదులు బలంగా నిలబడటానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన కృషి కీలకమని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆయన వేసిన పునాదులపై నేటి జీడీపీ వృద్ధి, ఆర్థిక స్థిరత్వం కొనసాగుతోందని పేర్కొంటున్నారు. అదే పరంపరలో నిర్మలా సీతారామన్ కూడా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమతుల్య బడ్జెట్లను ప్రవేశపెడుతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత ఏడాది బడ్జెట్‌లో 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కల్పించడం మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. తాజా బడ్జెట్ అనంతరం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి మధ్య బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గడం కూడా సామాన్యులకు లాభంగా మారింది. ఫిబ్రవరి 1న ఒక్కరోజులోనే బంగారం ధర సుమారు రూ.12,000 వరకు తగ్గడం గమనార్హం.
ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ మార్పుల కారణంగా ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు తగ్గుతాయని కంపెనీ ప్రకటించడం వినియోగదారుల్లో ఆశలు రేకెత్తించింది. 10–11 లక్షల రేంజ్‌లో ఉన్న కార్లు కూడా మరింత అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్హులైన మహిళలకు నెలకు సుమారు రూ.7,000 వరకు ప్రయోజనం చేకూరేలా ఈ పథకం రూపొందించబడింది. ఈ బడ్జెట్‌లో ఉచితాలకంటే సుస్థిర ఆర్థిక విధానాలపై దృష్టి పెట్టడం నిర్మలా సీతారామన్ ప్రత్యేకతగా పేర్కొనబడుతోంది.
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లలో సామాన్యులకు స్పష్టమైన లాభాలు కనిపించడం లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌తో పోలిస్తే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందన్న వాదన వినిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, ఒక ఇంటి గృహిణిలా ఆదాయం–వ్యయం సమతుల్యం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ విధానం మిడిల్ క్లాస్‌కు భరోసా ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

