కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తర్వాత, సామాన్యులు-మధ్యతరగతి వర్గాల్లో ఆశలు పెరిగాయి. ముఖ్యంగా కార్ల ధరలు తగ్గే అవకాశాలు, ఎలక్ట్రిక్ కార్లు సామాన్యులకు అందుబాటులోకి రావడం వంటి అంశాలు మిడిల్ క్లాస్‌కు ఊరటనిచ్చే పరిణామాలుగా మారాయి. ఇప్పటివరకు 10–11 లక్షల ధరల్లో ఉన్న కార్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ కేంద్ర బడ్జెట్‌ని చూస్తుంటే ఒక ప్రశ్న సహజంగానే వస్తోంది. ఇలాంటి ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎందుకు కనిపించడం లేదన్న సందేహం ప్రజల్లో బలపడుతోంది. ప్రతిసారి రాష్ట్ర బడ్జెట్ వేళ “పైసలు లేవు”, “భూములు లేవు”, “అప్పుల భారం” అంటూ కారణాలు చెప్పడం తప్ప, సామాన్యులకు ఏం అందించారన్న స్పష్టత మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో లెక్కలు ఎక్కడున్నాయి? సామాన్యులకు ఏ ప్రయోజనం దక్కింది? అన్న ప్రశ్నలు ఇంకా అనుత్తరంగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు ప్రకటించడమే తప్ప, వాటిని అమలు చేసే ఆర్థిక సామర్థ్యం లేదన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉందన్న విమర్శలు కూడా ఈ నేపథ్యంలో బలపడుతున్నాయి.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రం కొన్ని కీలక లాభాలు ప్రజలకు చేరుతున్నాయి. తాజాగా బడ్జెట్లో మహిళల కోసం ప్రవేశపెట్టిన బీమా పథకం ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. ఈ పథకాన్ని సక్రమంగా వినియోగించుకుంటే, ప్రతి మహిళకు నెలకు సుమారు ₹7,000 వరకు లాభం చేకూరే అవకాశం ఉందన్న సమాచారం వెలువడింది. ఇది ఉచితాల బడ్జెట్ కాదు, కాన్సెషన్లు, ఆర్థిక భద్రతపై ఆధారపడిన బడ్జెట్ అన్నదే ప్రత్యేకత.
ఈ బడ్జెట్లో ఉచితాలకు తావు లేకుండా, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ మిడిల్ క్లాస్, మహిళలు, పరిశ్రమల మధ్య సమతౌల్యం సాధించడం నిర్మల సీతారామన్ పనితనాన్ని మరోసారి చూపించింది. ఫైనాన్స్ సెక్రటరీ స్థాయి నుంచి ఆర్థిక మంత్రి స్థాయి వరకు ఆమె చేసిన కృషి ప్రశంసనీయం అన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది.
మొత్తానికి, కేంద్ర బడ్జెట్ ముందు తెలంగాణ బడ్జెట్ నిలబడలేకపోతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం చూపుతున్న ఆర్థిక దిశను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అనుసరిస్తుందన్నది వేచి చూడాల్సిన అంశమే.

