తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలో షూటింగ్స్ దందా?చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భద్రతా లోపాలు, విద్యార్థినుల ఆందోళన

తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి మహిళా కళాశాల) లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగినప్పటికీ, ఎప్పుడూ కూడా కళాశాల నడుస్తున్న సమయంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదని పూర్వ విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు.

కోటి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినిగా, అలాగే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకురాలిగా ఉన్న రోజుల్లో ఒక్క విద్యార్థినికీ అన్యాయం జరగకుండా చూసుకున్నామని వారు చెబుతున్నారు. కానీ నేడు అదే కళాశాలలో చదువుతున్న అమ్మాయిలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నారు.

యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నప్పటికీ, యూనివర్సిటీకి ఉండాల్సిన కనీస వసతులు కూడా అక్కడ లేవన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైస్ చాన్సలర్‌కు ఏం చేయాలో తెలియని పరిస్థితి, షూటింగ్స్‌కు ఎప్పుడు అనుమతి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదన్న స్పష్టత లేకపోవడం విద్యార్థినుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ముఖ్యమంత్రి యూనివర్సిటీ పేరును మార్చినప్పటికీ, అవసరమైన నిధులు కేటాయించకపోవడం వల్ల యూనివర్సిటీని సినిమా షూటింగ్స్‌కు అద్దెకు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హాస్టల్ పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, బ్రిటిష్ కాలం నాటి భవనాల్లోనే విద్యార్థినులు ఉండాల్సి వస్తోందని ఆరోపణలు ఉన్నాయి. సరైన సీసీటీవీ కెమెరాలు లేవు, రోడ్లు లేవు, భద్రతా ఏర్పాట్లు పూర్తిగా లోపించాయని విద్యార్థినులు చెబుతున్నారు.

జిల్లాల నుంచి వచ్చిన అమ్మాయిలను “సైడ్ క్యారెక్టర్లు ఇస్తాం” అంటూ వేధించిన సంఘటనలు బయటకు రావడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, రాష్ట్రంలో మహిళా విద్య పరిస్థితి ఏ స్థాయిలో ఉందన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీని పూరంబోకుల చేతిలో పెట్టినట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు తెలంగాణ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన తొలి మహిళా యూనివర్సిటీ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, విద్యార్థినుల భద్రత, వసతులు, భవిష్యత్తుపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *