కవిత అంటే బీఆర్ఎస్, కేవలం కేసీఆర్ ఆస్తి” అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసిన పిచ్చి మాటలేనని కవిత వర్గం స్పష్టం చేస్తోంది. కొందరు చేతగాని వ్యక్తులు కావాలనే రోజు రోజుకు ఒక ఎపిసోడ్‌లా ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రజలు వాటిని అసలు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు.
గ్రామస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, ముఖ్యంగా వయసు మీదపడిన పెద్దలు, మహిళలు కవితను చూసి గుండెలకు హత్తుకుంటూ ఆశీర్వదిస్తున్నారని చెబుతున్నారు. కారణం స్పష్టమని, ఆమెను కేవలం ఒక రాజకీయ నేతగా కాకుండా తెలంగాణ ‘బాపు’ కేసీఆర్ బిడ్డగా ప్రజలు భావిస్తున్నారని అంటున్నారు.
అయితే, “కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?” అనే ప్రశ్నను వారు తిరస్కరిస్తున్నారు. వారసత్వాన్ని అంగీకరిస్తూనే, కేవలం వారసత్వ రాజకీయాలతో ముందుకు వెళ్లడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఉద్యమ భూమిలో నిలబడి, ప్రజా ఆకాంక్షలకు వారసురాలిగా ఎదిగిన నాయకురాలిగా కవితను చూస్తున్నామని అంటున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గుర్తులు, కేసీఆర్ ఫోటోలు లేకుండానే ప్రజలు ముందుకు వస్తున్నారని, అది రేపటి తరానికి ఒక కొత్త ఆశగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. స్వశక్తితో ఆలోచించగలిగే, ప్రపంచ రాజకీయాలపై అవగాహన ఉన్న నాయకురాలిగా కవిత ఎదిగిందని చెబుతున్నారు.
ఆస్తుల ఆరోపణలపై కూడా కఠినమైన కౌంటర్ ఇచ్చారు. “ఆస్తులు లేవని కాదు, కానీ అక్రమంగా సంపాదించామని ఆధారాలు ఉంటే వెంటనే బయట పెట్టండి” అని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉందని, నిజంగా ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు తేవాలని ప్రశ్నించారు.
కవిత ఇప్పటివరకు రాజకీయ పార్టీ కూడా పెట్టలేదని, ఇది ఒక లాభాపేక్షలేని సాంస్కృతిక ఉద్యమంగా నడుస్తోందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి నాయకత్వం సహకారంతో ముందుకు సాగుతున్న ఈ ప్రయత్నానికి డబ్బులు, ఆడంబరాలు అవసరం లేదని, ప్రజా బలం, ఆత్మబలం చాలు అని అన్నారు.
“10 సంవత్సరాలు కవిత ఎక్కడికి పోయింది?” అనే ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఆమె ప్రశ్నించలేదని కాదు, లోపల నుంచే పోరాటం చేసిందని, పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్, అంబేద్కర్ అంశాలు, తెలంగాణ సంస్కృతి, మహిళలపై దాడులపై ఆమె స్పష్టంగా మాట్లాడిందని గుర్తు చేశారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె ఎలాంటి దాగుడు మూతల రాజకీయాలు చేయలేదని, ఎదురుగా ప్రశ్నించే ధైర్యం ఆమెకు ఉందని తెలిపారు. అందుకే ఈ క్లిష్ట సమయంలో కూడా తెలంగాణ చైతన్యాన్ని మళ్లీ తన గడ్డపై రాజకీయంగా ముందుకు తీసుకువస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
చివరిగా, మీడియా మరియు సమాజానికి ఒక విజ్ఞప్తి చేశారు. రోజూ నిరాధార ఆరోపణలపై టైం వేస్ట్ చేయడం కంటే, భవిష్యత్తు తెలంగాణ కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. తప్పులు ఉంటే చూపించండి, సరిదిద్దుకుంటామని, కానీ బూచిగా చూపిస్తూ ప్రచారం చేయడం మాత్రం ఆపాలని స్పష్టం చేశారు.

