అమెరికాలోని ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి రోజు పరిచయ సమావేశాలు నిర్వహించగా, “21వ శతాబ్దంలో నాయకత్వం” అనే కోర్సులో భాగంగా అధికార విశ్లేషణ, నాయకత్వ అంశాలపై మొదటి సెషన్ జరిగింది.
సోమవారం ఉదయం 7 గంటలకు తరగతులు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ఈ కోర్సులో కేస్ స్టడీలు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్, వివిధ అంశాలపై విశ్లేషణాత్మక తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అయితే, ముఖ్యమంత్రి ఈ కోర్సుకు హాజరవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇది ప్రభుత్వ టూరా? లేక వ్యక్తిగత టూరా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ ప్రజాధనంతో ఈ కోర్సుకు హాజరవుతున్నట్లయితే, అది వ్యక్తిగత రాజకీయ నైపుణ్యాల కోసం ప్రభుత్వ నిధులను వినియోగించినట్లవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక వ్యక్తిగత ఖర్చులతో ఈ కోర్సుకు హాజరైతే, పరిపాలనకు అవసరమైన రాజకీయ, నాయకత్వ నైపుణ్యాలు తనకు లేవని ముఖ్యమంత్రి పరోక్షంగా అంగీకరించినట్లేనన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మళ్లీ లీడర్షిప్ కోర్సు చేయాల్సిన అవసరం ఏమిటన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
“ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? లీడర్షిప్ గురించి మళ్లీ నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?” అనే ప్రశ్నలు సోషల్ మీడియా, రాజకీయ వేదికల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో నేర్చుకునే నాయకత్వ నమూనాలు తెలంగాణ రాజకీయ పరిస్థితులకు ఎంతవరకు ఉపయోగపడతాయన్న అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అంతర్గత విభేదాలు, బ్లాక్‌మైలింగ్ ఆరోపణలు వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో, విదేశాల్లో నేర్చుకున్న లీడర్షిప్ మోడళ్లను ఇక్కడ అమలు చేయడం అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు రాజకీయ విశ్లేషకులు, ఈ తరహా కోర్సులు ముఖ్యమంత్రి అయ్యే ముందు లేదా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేయాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తంగా, హార్వార్డ్ కోర్సుపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వకపోతే, ఈ అంశం రానున్న రోజుల్లో మరింత రాజకీయ దుమారం రేపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

