పేదవాడి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ అండ: నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, ఇంకా మూడు విడతలు ఇస్తాం – మంత్రి స్పష్టం

గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా నిలిచే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి స్పష్టం చేశారు. గత పాలనలో పేదవాడికి ఆత్మగౌరవంగా ఉండే ఇంటిని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల కమిషన్ల రాజకీయాలు జరిగాయే తప్ప పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు.

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు ఇచ్చామని, సుజాత నగర్ ప్రాంతానికి కూడా ఇళ్ల మంజూరు జరిగిందని చెప్పారు. రానున్న ఏప్రిల్ నెలలో రెండో విడత, ఆ తర్వాత మూడో, నాలుగో విడతలుగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇల్లు మంజూరు చేసి కాగితం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదని, ప్రతి సోమవారం ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలం లేని నిరుపేదల సమస్యను కూడా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. నివాసానికి అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట్ల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే బాధ్యత తానే తీసుకుంటానన్నారు.

పది సంవత్సరాలు పాలించి ఇప్పుడు వచ్చి మాటలతో మభ్యపెట్టే నాయకుల్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 53 నుంచి 55 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కొత్తగూడెం కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు కొనసాగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *