పచ్చి అబద్ధాలతో వ్యక్తిత్వ హననం: నమస్తే తెలంగాణ, కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు

పచ్చి అబద్ధాలతో తనపై మరియు కాంగ్రెస్ పార్టీపై కుట్రపూరితంగా బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. జేసీబీ ఓనర్ల మధ్య జరిగిన చిన్న ఘటనను వక్రీకరించి, తనపై రూ.8 కోట్ల డిమాండ్ చేసినట్లు తప్పుడు కథనం ప్రచురించారని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ నెల మొదటి వారంలో జరిగిన ఒక సంఘటనను ఆసరాగా తీసుకుని, టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో కావాలనే అసత్య కథనం ప్రచురించారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి జేసీబీ ఓనర్‌కు స్థానికులకు ఇవ్వాల్సిన రూ.8 లక్షల విషయాన్ని రూ.8 కోట్లుగా మార్చి తనపై డబ్బులు అడిగినట్లుగా చిత్రీకరించారని తెలిపారు.

ఆ తప్పుడు కథనాన్ని ఆధారంగా చేసుకుని ‘తెలుగు స్క్రైబ్’ సహా పలు యూట్యూబ్ ఛానళ్లలో విచ్చలవిడిగా ప్రచారం చేశారని, అలాగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం, మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం, పార్టీ ప్రతినిధులు మాట్లాడడం ద్వారా తప్పుడు ప్రచారాన్ని మరింత పెంచారని ఆరోపించారు.

వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులో కూడా తనపై డబ్బులు డిమాండ్ చేశానన్న ఒక్క ఆధారం కూడా లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ పత్రిక చూపిస్తూ, సంఖ్యలను మార్చి, అసత్యాలను నిజాలుగా చూపించే ప్రయత్నం చేయడం తీవ్ర అన్యాయమని అన్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా మచ్చలేని వ్యక్తిత్వం తనదని, అలాంటి తన గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు, కృష్ణాంక్, నమస్తే తెలంగాణ, తెలుగు స్క్రైబ్ తదితరులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తానని, తప్పుడు ప్రచారాలు ఆగే వరకు న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు నిజాలు మాట్లాడినా వాటిని అబద్ధాలుగా చూపిస్తూ, పచ్చి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసే ప్రయత్నం గత కొద్ది రోజులుగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. సొంత మీడియా, పెయిడ్ ఛానళ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీని, నాయకులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

తాను నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నందున అక్కడే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన తన గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని, ఎలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *