పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికలకు నాంది: సీఎం రేవంత్ రెడ్డి

2029లో కూడా ఇదే రీతిలో ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం వెల్లడించారు. రెబెల్స్‌తో కలిపి మొత్తం 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ఇది మొత్తం పంచాయతీల్లో 66 శాతం అని వివరించారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయని సీఎం ఆరోపించారు. అయినప్పటికీ రెండు పార్టీలకు కలిపి కేవలం 33 శాతం పంచాయతీలే దక్కాయని తెలిపారు. బీఆర్ఎస్ 3,511 స్థానాల్లో, బీజేపీ 710 స్థానాల్లో మాత్రమే గెలిచాయని, మొత్తం కలిపి 4,221 పంచాయతీలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఈ ఎన్నికలే పునాది అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని సీఎం గుర్తు చేశారు. 94 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే, 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అత్యధిక పంచాయతీలు గెలుచుకుందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి అదనంగా 21 నియోజకవర్గాల్లో ఆధిక్యం వచ్చిందన్నారు.

ఈ ఫలితాలకు కారణం గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలేనని సీఎం పేర్కొన్నారు. సమపాలనతో ప్రజలకు స్వేచ్ఛను కల్పించడమే ఏడో గ్యారంటీగా నిలిచిందని చెప్పారు. ఈ విజయాలు తమ బాధ్యతను మరింత పెంచాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలకు ఇంకా అహంకారం తగ్గలేదని సీఎం విమర్శించారు. పంచాయతీ ఎన్నికల తీర్పైనా వారికి కనువిప్పు కలిగించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. స్పీకర్ నిర్ణయాలపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *