ఈపీఎస్–95 పెన్షన్ సమస్యలపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఐదవ తారీకు రోజున 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి గవర్నర్ గారి వద్దకు వెళ్లనున్నట్లు ఉద్యమ నేతలు ప్రకటించారు. “చలో రాజ్‌భవన్” కార్యక్రమం ద్వారా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించారు.
ఈపీఎస్–95 కింద ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం కేవలం రూ.1,000 పెన్షన్‌తోనే జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి, ప్రభుత్వానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధాప్యంలో గౌరవంగా జీవించాల్సిన హక్కు ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. పీఎఫ్, ఈపీఎఫ్ నిధులు సక్రమంగా అమలు కాకపోవడంతో లక్షలాది మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యమ నేతలు తెలిపారు.
ఈ సమస్యల కారణంగా ఇప్పటివరకు ఎంతోమంది ఈపీఎస్–95 పెన్షనర్లు మరణించారని, అయినా ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. ఈ నేపథ్యంలో రేపటి రోజున ప్రభుత్వానికి, గవర్నర్ గారికి ముందస్తు నోటీసులు అందజేస్తామని తెలిపారు. ఐదవ తారీకు జరగనున్న చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు మౌనంగా ఉన్న మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాస్ గౌడ్, మమత, స్వామి గౌడ్ తదితరులు బయటకు వచ్చి ఈపీఎస్–95 పెన్షనర్లకు మద్దతుగా నిలవాలని ఉద్యమ నేతలు డిమాండ్ చేశారు. “ఖజానా ఖాళీగా ఉంది” అనే కారణాలు చెప్పడం మానేసి, రిటైర్డ్ ఉద్యోగుల జీవన భద్రతపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈపీఎస్–95 పెన్షన్ సమస్య వ్యక్తిగతమైనది కాదు, ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశమని ఉద్యమ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు ఐక్యంగా ఈ ఉద్యమంలో పాల్గొని రాజ్‌భవన్ చలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

