ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి.. కొత్త విధానంపై సందేహాలు, విద్యార్థుల్లో ఆందోళనలు

రాష్ట్ర ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ విధానంలో కీలక మార్పులు తీసుకురానుంది. ఇప్పటివరకు కాలేజీల ఖాతాల్లో జమ అవుతున్న ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులను ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు అమలవుతున్న ఈ విధానాన్ని ఇకపై ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ విద్యార్థులకు కూడా విస్తరించనున్నారు.

అయితే ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పటికే ఉన్న ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలే సకాలంలో చెల్లించలేకపోతున్న ప్రభుత్వం, కొత్త విధానం తీసుకొచ్చినా ప్రయోజనం ఏమిటి?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు ఆలస్యంగా విడుదల కావడంతో అనేక ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ప్రత్యేకంగా పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. “ఫీజులు కట్టకపోతే పరీక్షలకు అనుమతి లేదు” అంటూ కొంతమంది విద్యార్థులను కాలేజీలు వేధించాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి అయినా ఫీజులు చెల్లించిన పరిస్థితులు కనిపించాయి.

ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని చెబుతున్నా, అసలు సమస్య డబ్బులు సమయానికి విడుదల కావడమేనని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. సమయానికి నిధులు విడుదల కాకపోతే మళ్లీ అదే సమస్యలు పునరావృతం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “కాలేజీల అకౌంట్‌లో పడినా, విద్యార్థుల అకౌంట్‌లో పడినా ఆలస్యమైతే ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నిస్తున్నారు.

ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా గతంలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు తాత్కాలికంగా మూతపడిన పరిస్థితులు కూడా వచ్చాయి. ప్రభుత్వంతో చర్చలు సరిగా జరగక విద్యార్థులు, యాజమాన్యాలు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్త విధానం అమలు చేయడానికి ముందు పాత బకాయిల సమస్యను పూర్తిగా పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంలో ప్రభుత్వం కేవలం కొత్త విధానాలు ప్రకటించడం కాకుండా, అమలు విషయంలో స్పష్టమైన కార్యాచరణ చూపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే ప్రతి సంవత్సరం పరీక్షల సమయానికి ఫీజులు, హాల్ టికెట్లు, బకాయిల సమస్యలతో విద్యార్థులు మళ్లీ మళ్లీ ఇబ్బందులు పడే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *