ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ రోగినైనా ఇకపై “సౌకర్యాలు లేవు”, “కేసు సీరియస్” అనే కారణాలతో తిప్పి పంపేందుకు వీలు ఉండదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయనుంది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేయాల్సిందే అన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పటిష్టమైన రిఫరల్ సిస్టం అమలుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఉన్నతాధికారులతో అంతర్గతంగా కీలక సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. రిఫర్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, దానికి స్పష్టమైన వైద్యపరమైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక సమస్యలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మందులు, మెడిసిన్స్ బిల్లులు, మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మల్కాజగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బాత్‌రూమ్‌లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని రోగులు, వైద్యులు వాపోతున్నారు.
రోగులకే కాకుండా అక్కడ పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బందికీ సరైన వసతులు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద నియోజకవర్గంగా చెప్పుకునే మల్కాజగిరిలో పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే సమయంలో, మల్కాజగిరి పరిధిలో భూకబ్జాలు, అక్రమ లావాదేవీలపై కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొందరు రాజకీయ నేతల పేర్లను ఉపయోగించి భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని, బాధితులు ఏళ్ల తరబడి న్యాయం కోసం తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది.
ఓట్లు అడిగే సమయంలో ప్రజల దగ్గరకు వచ్చే నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై స్వయంగా అనుభవించిన బాధితులు, “ఇది మాటల సమస్య కాదు, నిజ జీవిత సమస్య” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటిస్తున్న రిఫరల్ సిస్టం కఠినంగా అమలైతే కనీసం రోగులకు తొలి చికిత్స అందే అవకాశం ఉంటుందని, అలాగే బాధ్యతాయుతమైన వైద్య వ్యవస్థ ఏర్పడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ మార్పులు రావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

