గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ఉత్కంఠ – కోదండరామ్, అజారుద్దీన్ ఫైళ్లపై రాజ్‌భవన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాల విషయంలో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను క్యాబినెట్ సిఫారసు చేసి రాజ్‌భవన్‌కు పంపిన ఫైళ్లపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ అంశంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టత ఇవ్వడంతో, ఇప్పుడు పూర్తిగా గవర్నర్ నిర్ణయంపైనే దృష్టి కేంద్రీకృతమైంది. క్యాబినెట్ పంపిన సిఫారసులను ఆమోదిస్తారా? లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫైల్‌ను తిరిగి పంపుతారా? లేదా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉంటారా? అన్న ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.

రాజ్‌భవన్‌కు ఫైల్ వెళ్లి ఇప్పటికే ఐదు నెలలు పూర్తవగా, ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణకు వెళ్లి పెండింగ్‌లో పడింది. తాజాగా సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడంతో, ఇక గవర్నర్ నిర్ణయం కోసం ప్రభుత్వం, సంబంధిత నేతలు ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా అజారుద్దీన్ పరిస్థితి కీలకంగా మారినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరో మూడు నెలల్లో ఎమ్మెల్సీగా నామినేషన్ ఖరారు కాకపోతే, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆయనపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే తరహాలో ఎమ్మెల్సీ పదవి రద్దయ్యాక మళ్లీ కోదండరామ్‌కు అదే పదవి ఇవ్వడంపై అప్పట్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అదే పదవి మరోసారి ఇరకాటంలో పడటం గమనార్హం. ముఖ్యంగా ఇప్పటికే రద్దైన ఎమ్మెల్సీ పదవిని తక్షణమే అదే వ్యక్తికి మళ్లీ కేటాయించడం చట్టపరంగా ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదం లభించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల సమయంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మైనారిటీ మంత్రిగా నియమించడాన్ని అప్పుడే తాత్కాలిక ఏర్పాటుగానే రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికల అవసరాల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారని, ఆ తర్వాత పరిస్థితి మారుతుందన్న అంచనాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం అదే అంచనాలు నిజమవుతున్నాయన్న చర్చ జరుగుతోంది.

మొత్తంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం ప్రభుత్వం–రాజ్‌భవన్ మధ్య కీలక రాజకీయ పరీక్షగా మారింది. రాజ్యాంగ పరిమితులు, చట్టబద్ధత అంశాలను పరిగణలోకి తీసుకొని గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *