గ్రేటర్ హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ పరిపాలనను మరింత వికేంద్రీకరించాలనే లక్ష్యంతో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హెచ్ఎండిఏ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్ రంజన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతుండగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన, మల్కాజగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. నియమిత అధికారులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు.
ప్రభుత్వం నిర్ణయంతో హైదరాబాద్ నగర పరిపాలనను మూడు ప్రధాన కార్పొరేషన్లుగా విభజించారు:
- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)
- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC)
- మల్కాజగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)
మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక వెబ్‌సైట్లు, పరిపాలనా విభాగాలు, అధికారులకు లాగిన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. కొత్త కార్పొరేషన్ల పరిధిలో బిల్డింగ్ పర్మిషన్లు జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
కార్పొరేషన్ల వివరాలు
- GHMC (హైదరాబాద్):
689 చదరపు కిలోమీటర్ల పరిధి, 150 వార్డులు, 30 సర్కిళ్లు, 70 లక్షలకు పైగా జనాభా. - సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్:
613 చదరపు కిలోమీటర్లు, 76 వార్డులు, 16 సర్కిళ్లు, 31 లక్షల జనాభా. - మల్కాజగిరి మున్సిపల్ కార్పొరేషన్:
654 చదరపు కిలోమీటర్లు, 74 వార్డులు, 14 సర్కిళ్లు, సుమారు 35 లక్షల జనాభా.
ప్రభుత్వం ప్రకారం ఈ విభజనతో పరిపాలన సులభతరం అవుతుందని, మౌలిక వసతులు, పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతాయని భావిస్తోంది. అయితే జిహెచ్ఎంసిని హఠాత్తుగా విభజించడం పై రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ చర్య అని స్పష్టం చేస్తోంది.
కొత్తగా ఏ ఏ ప్రాంతాలు ఏ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయనే పూర్తి వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో డివిజన్ల పునర్విభజన, ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డుల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చ కొనసాగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనలో ఇది కీలక మార్పుగా భావించబడుతోంది. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

