ట్రాఫిక్ చలాన్ల వసూలులో బలవంతం నిషేధం: వాహన తాళాలు లాక్కునే హక్కు పోలీసులకు లేదు – హైకోర్టు

ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని, చలాన్ల వసూలు కోసం వాహనాలను అడ్డుకోవడం లేదా వాహనాల తాళం చెవులు లాక్కునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా చెల్లించకపోతే, చట్ట ప్రకారం సంబంధిత కోర్టు ద్వారా మాత్రమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలాన్లు చెల్లిస్తే వసూలు చేయవచ్చని, అంతే తప్ప బలవంతపు చర్యలకు పాల్పడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

చలాన్ల వసూలు పేరుతో పోలీసులు కఠినమైన, దౌర్జన్య పద్ధతులు అవలంబిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి, ట్రాఫిక్ చలాన్ల వసూలులో పోలీసుల పాత్రపై ప్రశ్నలు సంధించింది. ఈ ఆదేశాలు సాధారణ తనిఖీలకు వ్యతిరేకం కాదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

చలాన్ల వసూలు వ్యవహారంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాహనాన్ని ఆపి పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ మొత్తం మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేయడం, డబ్బులు లేకపోతే వాహనాన్ని ఇవ్వమంటూ తాళాలు లాక్కోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని వివరించారు.

కూలీ పనులు చేసుకునే వారు, ఆటో డ్రైవర్లు వంటి సామాన్య ప్రజలకు ఒక్కసారిగా వేల రూపాయలు చలాన్లు చెల్లించడం సాధ్యం కాదని, అయినా అప్పులు చేయాలని కూడా ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. చాలా సందర్భాల్లో చలాన్లు ఎందుకు పడ్డాయో కూడా తెలియని పరిస్థితి ఉందని, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేశారంటూ వాహనం లేకుండా ఉన్న ఫోటోలతో కూడా చలాన్లు విధిస్తున్నారని వాపోయారు.

ఈ వ్యవహారాలన్నింటిపై స్పందించిన హైకోర్టు, ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో రాజ్యాంగం, చట్టం ప్రకారం మాత్రమే పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ డీజీపీకి, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో అయినా ట్రాఫిక్ చలాన్ల వసూలులో మార్పు వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉందని, పోలీసుల దౌర్జన్య వైఖరిపై కఠిన చర్యలు అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *