10వ తరగతి వార్షిక పరీక్షలు ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్ల దందా జోరుగా సాగుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు “హలో సార్… మీ పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడా?” అంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, భారీ డిస్కౌంట్లు, ఫీజు రాయితీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంకా విద్యా సంవత్సరం ముగియకముందే, 2026–27 విద్యా సంవత్సరానికి ఆరు నెలల సమయం ఉండగానే అడ్మిషన్లు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇంటర్ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, వాటిని తుంగలో తొక్కుతూ కార్పొరేట్ కాలేజీలు ముందస్తు ప్రవేశాలు చేపడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, విద్యార్థుల ఫోన్ నంబర్లు పాఠశాలల నుంచే లీక్ అవుతున్నాయన్న ఆరోపణలు. ప్రైవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా డేటా సేకరిస్తూ, తల్లిదండ్రులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. “సీట్లు అయిపోతాయి”, “ఇప్పుడే జాయిన్ చేస్తే 50 శాతం డిస్కౌంట్”, “మరో విద్యార్థిని చేర్పిస్తే ఇంకా రాయితీ” వంటి మాటలతో ఒత్తిడి పెంచుతున్నారని పేరెంట్స్ వాపోతున్నారు.
ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువును ఒక వ్యాపారంగా మార్చేశాయని, విద్యకు విలువ లేకుండా చేస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణ, శ్రీచైతన్య లాంటి కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిడి, మానసిక వేధింపులు పెరిగి ఆత్మహత్యలకు దారి తీసిన సంఘటనలు ఉన్నా, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
అధికారులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వసూళ్ల దగ్గర మాత్రమే అధికారులు చురుకుగా ఉంటారని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
విద్యపై ప్రభుత్వానికి సరైన దృష్టి లేకపోవడం వల్లే ప్రైవేట్ రంగం ఇష్టానుసారంగా దందాలు చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు బలోపేతం చేస్తేనే ఈ పరిస్థితి మారుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు భయపడకుండా, 10వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాతే అడ్మిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. “సీట్లు దొరకకపోయినా పర్వాలేదు” అని స్పష్టంగా చెప్పి, ముందస్తు అడ్మిషన్ల ఒత్తిడికి లోనుకాకూడదని హెచ్చరిస్తున్నారు

