హామీలు ఇస్తూ కాలం గడిపేస్తున్న ప్రభుత్వాలపై తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పటివరకు అమలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్లెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో భారీ ఎత్తున నిరుద్యోగ యువత మహాధర్నా నిర్వహించింది.
ఈ ఉద్యమం రాజకీయ ప్రేరితమైంది కాదని, ఇది తమ జీవన సమస్యల నుంచి పుట్టిన పోరాటమని నిరుద్యోగులు స్పష్టం చేశారు. చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఉద్యోగార్థులు ఈ ధరణలో పాల్గొన్నారు. సంవత్సరాల తరబడి చదువులు కొనసాగిస్తూ, కనీస ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇప్పటికీ మాటలకే పరిమితమైందని నిరుద్యోగులు విమర్శించారు. కనీసం రెండు నుంచి నాలుగు ప్రధాన శాఖల్లోనైనా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు లేకపోవడంతో తమ భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇన్వెస్ట్మెంట్లు, పరిశ్రమలు వస్తున్నాయంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ఆ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కడం లేదని నిరుద్యోగులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 75 శాతం లోకల్ జాబ్స్ హామీ అమలులో కనిపించడంలేదని ప్రశ్నించారు. నిజంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు అమలైతే యువత డెలివరీ బాయ్‌లు, కాంట్రాక్ట్ ఉద్యోగాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదే కాదని అన్నారు.
ప్రభుత్వ పెద్దల నుంచి నిరుద్యోగులపై బెదిరింపు ధోరణి మాటలు రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ధరణలో పాల్గొన్న యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమస్యలు శాంతియుతంగా చెప్పుకునే హక్కు తమకుందని, భయపెట్టే మాటలతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నిరుద్యోగ యువత స్పష్టం చేసింది. ఉద్యోగాలు ఇస్తే ఉద్యమాలు ఉండవని, హామీలు అమలు చేయకపోతే నిరుద్యోగుల ఆవేదన మరింత ఉధృతమవుతుందని వారు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

