తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అడుగు – పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకు సాగుతున్న యువ నాయకులు

జనసేన పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు ముందుకు సాగుతోంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రభావంతో అనేక మంది యువకులు రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో జనసేనలో చేరుతున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

రాజమల్లయ్య మాట్లాడుతూ, తాను ఎన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానినని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అభివృద్ధి తనను రాజకీయాల వైపు నడిపించిందని తెలిపారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, తన చుట్టూ ఉన్నవారికి కూడా మేలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనల కోసం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఎలా ముందుకు సాగిందో, అలాగే తెలంగాణ గడ్డపై కూడా జనసేన బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పార్టీగా జనసేన నిలుస్తుందని అన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో జనసేన పార్టీ పోటీ చేస్తోందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో పార్టీ తన ఉనికిని చాటుతోందని, నిబద్ధత కలిగిన నాయకులు, యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.

ఈ క్రమంలో చొప్పదండి మున్సిపాలిటీలో జనసేన పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. తక్కువ సీట్లలో పోటీ చేసినా, ఆ సీట్లలో బలంగా ప్రజల్లోకి వెళ్లాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అని నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిమిత స్థానాల్లో పోటీ చేసినా, భవిష్యత్తులో జనసేన ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని తెలిపారు.

ఎనిమిదవ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆలోచనలే తనను జనసేన వైపు ఆకర్షించాయని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని, తన వార్డులో కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సామాన్య వ్యక్తికి అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తుండగా, యువత ఆధారిత రాజకీయాలకు ఇది ఒక కొత్త దిశగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *