జూబిలీహిల్స్ ఉపఎన్నిక మరింత వేడెక్కింది. నేటి నుంచి ప్రధాన పార్టీల అగ్రనేతలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఓటర్ల మద్దతు సంపాదించేందుకు నాయకులు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు.
కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి విస్తృత ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తూ, హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ, పార్టీకి మద్దతు కోరుతున్నారు.
ఇదే సమయంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జూబిలీహిల్స్‌లో 10 రోజులపాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ శక్తిని మళ్లీ రుజువు చేయాలని ఆ పార్టీ ప్రణాళిక రూపొందించింది.
బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం వేగవంతం చేశారు. ఆదివారం ఆదివారం ప్రత్యేక ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యలను ఎత్తిచూపుతున్నారు. అయితే, ఆయన గతంలో ఎంపీగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఇంతకాలం ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే ప్రభుత్వం పనులు ప్రారంభించడంతో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి.
ఓటర్ల్లో కూడా అవగాహన పెరిగింది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగే సమాచారం పట్ల సందేహం వ్యక్తం చేస్తూ, “మీరు చెప్పిన హామీలు నెరవేర్చారా?” అని నేరుగా ప్రశ్నిస్తున్న ప్రజలు కనిపిస్తున్నారు. ఉపఎన్నికలో ప్రజలు నాయకులను ప్రశ్నించే తీరు మరింత ఆసక్తికరంగా మారింది.
మూడు ప్రధాన పార్టీలూ భారీస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో జూబిలీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.

