జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రిగ్గింగ్ ఆరోపణలు – ప్రజాస్వామ్యం ఎక్కడ?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఓటేయని వారిని డబ్బులు తిరిగి ఇవ్వమని పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేయడం, బూత్ కమిటీ సభ్యులు ఓటర్ల లిస్టులు పరిశీలించి ఎవరు ఓటు వేయలేదో గుర్తించడం వంటి ఘటనలు తీవ్రంగా విమర్శించబడుతున్నాయి.

ఒకే ఇంట్లో 18 ఓట్లు ఉంటే కేవలం నలుగురే ఓటు వేసారన్న సమాచారం బయటకు రావడం, మిగిలినవారిపై రికవరీ ప్రయత్నాలు చేయడం ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిగ్గింగ్ జరిగినట్టే అన్న అభిప్రాయం బలపడుతోంది.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణలు, పోలీస్ దళాల సమక్షంలోనే అల్లర్లు జరగడం, అధికార ప్రతినిధులు ప్రోటోకాల్ ఉల్లంఘించి బూత్‌ల దగ్గర స్లిప్పులు పంచడం వంటి సంఘటనలు ప్రజాస్వామ్య విలువలకు మచ్చ తెచ్చాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లు బూత్‌ల వద్ద హాజరై ఉండటం, పోలింగ్ సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకు అలజడులు సృష్టించడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి గట్టి చర్యలు తీసుకోకపోవడం మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది.

అదనంగా మహిళల పేర్లతో దొంగ ఓట్లు వేసిన ఘటనలు, సాయంత్రం వరకు కొనసాగిన పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ వేగంగా విడుదలైన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక రాజకీయ నాయకుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తులే రోడ్లపై రౌడీలా ప్రవర్తించడం, మాటల తూటాలు సంధించడం, మహిళలపై అసభ్య పదజాలం వాడడం ప్రజలలో అసహనాన్ని కలిగిస్తోంది.

మొత్తం మీద ఈ ఉపఎన్నిక ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలా కాకుండా, అధికార రాజకీయాల రంగస్థలం గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరు గెలిచినా, ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోయిందన్న అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *