జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్‌నగర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ఫీల్డ్ రిపోర్ట్. దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగగా, రెండు సంవత్సరాల క్రితం ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా బస్తీల్లో ప్రత్యేకమైన మార్పులు కనిపించడం లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
ప్రజల అభిప్రాయం ప్రకారం మౌలిక సదుపాయాల విషయంలో పెద్ద మార్పులు లేవని, నీటి సమస్యలు, కరెంట్ సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెబుతున్నారు. కొంతమంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రశంసించినప్పటికీ, “అదొక్కటే తప్ప మరే పెద్ద మార్పు లేదు” అని పేర్కొన్నారు..
అటు స్థానిక ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు కొత్త ప్రభుత్వం వచ్చినా తమ జీవన విధానంలో ఎలాంటి పురోగతి జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ చేరడం లేదని, గృహవసతి, సంక్షేమ పథకాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజకీయంగా చూస్తే, ఈ ప్రాంత ప్రజల్లో ఎవరికీ స్పష్టమైన మద్దతు లేదు. కొంతమంది బీఆర్ఎస్‌పై విశ్వాసం వ్యక్తం చేయగా, కొంతమంది కాంగ్రెస్ నాయకులపై అసంతృప్తి చూపిస్తున్నారు. నవీన్ యాదవ్‌కు స్థానికత వలన కొంత మద్దతు కనిపించినప్పటికీ, “ఏం చేస్తారో చూద్దాం” అనే సందేహం ఎక్కువ ఉంది. BJP ప్రస్తావన మాత్రం చాలా తక్కువగా వినిపిస్తోంది. స్థానికుల అభిప్రాయం ప్రకారం బీజేపీ పోటీ లోనే లేదనే భావన బలంగా ఉంది.
మొత్తం పరిస్థితి చూసినట్టయితే,
- ప్రజల్లో అసంతృప్తి
- పార్టీలపై అయోమయం
- అభ్యర్థులపై మిశ్రమ స్పందన
కనిపిస్తోంది. - బస్తీల్లో బస్సుల ఉచిత ప్రయాణం వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ, జీవన ప్రమాణాలు మారలేదని, మౌలిక సదుపాయాల లోపం ఇప్పటికీ పెద్ద సమస్యగానే ఉందని ప్రజలు వెల్లడించారు.
- ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఆసక్తికరంగా మారింది. మూడు పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ ప్రజలు ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్న వాతావరణం కనపడుతోంది.

