జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైన నేపధ్యంలో, ఓ యువతి తన వ్యక్తిగత జీవితంలోని బాధలు, కష్టాలు పంచుకుంటూ, తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం తన స్వగ్రామం తిరుమలాపూర్‌కు వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆమె మాట్లాడుతూ— “నా తల్లిదండ్రులు ఇక లేరు, అయినప్పటికీ వారి ఆశీర్వాదాలు నాకు చాలా అవసరం. అమ్మాయి కబరస్థానానికి వెళ్లకూడదనే మతపరమైన ఆచారం ఉన్నా, నేను దూరం నుంచైనా పూలు సమర్పించి నా దువా చదివి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాను,” అని కన్నీళ్లు ముద్దాడుతూ చెప్పింది.
ఆమె తెలిపినదేమిటంటే, తాను పల్లెటూరు వాతావరణంలో పెరిగి, ఒక ఉద్యోగం సాధించాలని హైదరాబాదుకి వచ్చిందని. అయితే, నోటిఫికేషన్లు లేకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత అన్యాయానికి గురవుతోందని తీవ్రంగా పేర్కొంది. ఈ పరిస్థితుల్లోనే తన మనసులో ఉన్న బాధను రాజకీయంగా వ్యక్తపరచాలని నిర్ణయించుకొని, జూబ్లీ హిల్స్ నుండి పోటీకి దిగుతానని ఆమె ప్రకటించింది.
తనకు కుటుంబం లేకపోవడం వల్ల సమాజమే తన కుటుంబమని చెప్పిన ఈ యువతి, “నిరుద్యోగులే నా అన్నలు చెల్లెల్లు, జూబ్లీ హిల్స్ ప్రజలే నా తల్లిదండ్రులు. మీరు నా బాధను అర్థం చేసుకుని ఆశీర్వదించాలి” అని కోరుకుంది.
ఆమె మాటల్లో వినిపించిన బాధ, నిజాయితీ ప్రజల్లో స్పందన రేపుతోంది. పల్లెటూరి పేదరికం నుంచి పైకి రావాలని తపనపడిన ఒక యువతి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో తన గొంతు వినిపించాలనే సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తోంది.

