తెలంగాణ అసెంబ్లీ వేదికగా దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మానకొండూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న కల్వల ప్రాజెక్ట్ 2023లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అప్పట్లో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించలేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 6–7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఇటీవల తమ నియోజకవర్గంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ నిర్మించిన చెక్‌డ్యామ్‌ను బాంబులతో పేల్చిన ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. ఇది మేడిగడ్డ ఘటన తరహాలో ఉందని సభ్యులు పేర్కొన్న అంశాన్ని సభ నోట్ చేసుకున్నట్లు తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, గత యాసంగితో పోలిస్తే ఈసారి వరి నాట్లు రెట్టింపుగా పెరిగాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో యూరియా సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించడం గ్రామీణ రైతులకు సాధ్యం కాదని స్పష్టం చేశారు.
కరెంట్ సరఫరా రోజుకు కేవలం 8 నుంచి 9 గంటలకే పరిమితం కావడం వల్ల నాట్ల సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వేసవి కాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు. చాలా గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు లేవని, బడ్జెట్ లేదని అధికారులు రైతులకు చెప్పడం బాధాకరమని అన్నారు.
మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటికి సంబంధించిన కాలువలు పూడికతో నిండిపోయాయని, వాటిని వెంటనే శుభ్రం చేయకపోతే ఈ సంవత్సరం రైతులు నష్టపోతారని తెలిపారు. రెండు సంవత్సరాలుగా ఇరిగేషన్ శాఖ నుంచి కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా జరగలేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిర్మించిన మూడు ప్రాజెక్టులపై దుబ్బాకలో లక్షల ఎకరాల సాగు ఆధారపడి ఉందని, నీరు ఉన్నప్పటికీ కాలువల నిర్వహణ లేక రైతులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. గతంలో రైతులు సొంత ఖర్చులతో తాత్కాలిక కాలువలు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు.
ఇక ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ రైస్ మిల్లుల వద్ద అన్లోడ్ కాకుండా నిలిచిపోవడం, తరుగు పేరుతో కటింగ్ కొనసాగడం వంటి సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా, కరెంట్, సాగునీరు — ఈ మూడు రైతులకు అత్యంత కీలకమని పేర్కొంటూ, ఇప్పటికైనా ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు సిద్దిపేట జిల్లా, దుబ్బాక నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులను కాపాడాలని ఎమ్మెల్యే సభా వేదికగా విజ్ఞప్తి చేశారు.

