కరీంనగర్ కార్పొరేషన్‌లో ట్విస్టుల రాజకీయాలు… మేయర్ పీఠంపై అనిశ్చితి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మేయర్ పీఠం దాదాపు భారతీయ జనతా పార్టీ సొంతమవుతుందనే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీలో చేరిన 15వ డివిజన్ కార్పొరేటర్ విప్పుల సాయి జ్యోతి, ఆదివారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

మొదట కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి మద్దతు కోరగా, ఆరోగ్య కారణాలతో హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయిన సాయి జ్యోతి చివరికి కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక మరోవైపు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు విప్ జారీ చేసేందుకు ప్రయత్నించినా, సాయి జ్యోతి స్పందించకుండా వెళ్లిపోవడం మరింత చర్చనీయాంశమైంది. అనంతరం ఆమెతో పాటు మరో కార్పొరేటర్ కూడా హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.

మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక విషయంలో బీజేపీ శిబిరంలో కూడా అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని వర్గాలకు పదవులు ఇవ్వకపోతే మద్దతు ఇవ్వబోమని సీనియర్ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ పరిణామాలపై స్పందించిన ఫార్వర్డ్ బ్లాక్ నాయకత్వం, తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థిని బీజేపీలో చేర్చుకోవడం సరైంది కాదని విమర్శించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై కూడా విమర్శలు వ్యక్తం చేస్తూ, బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రశక్తే లేదని స్పష్టం చేసింది.

మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయాలు గంట గంటకు మారుతున్నాయి. మేయర్ పీఠం ఎవరిదవుతుందో అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *