లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమం చేస్తే, అదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు — కేసీఆర్, హరీష్ రావు, కవిత — 2010లోనే అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నారని మధు యాష్కి ఆరోపించారు. కవిత తెలంగాణ ఉద్యమం పేరుతో సంపాదించారని, మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాక కూడా భారీగా సంపాదించారని విమర్శించారు. జిల్లాకో పీఏ పెట్టుకోవడం, వేల కోట్ల ఆస్తులు కూడబెట్టడం అన్నీ ప్రజల ముందే ఉన్న వాస్తవాలేనని అన్నారు.
కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకోవాలనే దుస్థితి లేదని స్పష్టంగా చెప్పారు. మూడు వేల కోట్లతో రాజభవంతులాంటి ఇళ్లు కట్టుకున్నారని, నైనీలో టెండర్లలో కాంట్రాక్ట్ అలొకేషన్ లేకపోయినా, బొగ్గుతనం లేకపోయినా స్కామ్ ఎలా జరగలేదని చెప్పగలరని ప్రశ్నించారు.
నైనీ ప్రాజెక్టులో టెండర్ల కేటాయింపులు జరగలేదని, బొగ్గు తవ్వకం కూడా లేదని చెబుతూ, అలాంటి పరిస్థితుల్లో స్కామ్ ఎలా జరుగుతుందో కవిత ప్రశ్నిస్తున్నారని తెలిపారు. మరోవైపు, ‘మీరు వస్తే నా పార్టీలో కీలక పదవులు ఇస్తా’ అంటూ ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తుండటంపై కూడా మధు యాష్కీ విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ఎందుకు ఆమెను అడగాలి అన్న ప్రశ్నే లేదని, అయితే రాజకీయాల్లో అడిగే స్కోప్ మాత్రం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాలన్నీ చివరకు ఎటు దారితీస్తాయో వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు.

