తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల మేడ్చల్‌లో జరిగిన సభలో కవిత తన కొత్త పార్టీ పేరును “తెలంగాణ రాష్ట్ర సేన (TRS)”గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం “తెలంగాణ రక్షణ సేన” పేరును పరిశీలనకు తీసుకుని నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏప్రిల్ 25న జరిగిన ఆవిర్భావ సభలో కవిత కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. కానీ ఎన్నికల సంఘానికి సమర్పించిన అధికారిక దరఖాస్తులో ఆ పేరు లేకపోవడం గమనార్హం. ఆమె ఎన్నికల సంఘానికి మొత్తం ఐదు పేర్లు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. వాటిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లు ఉన్నాయి.
ఇప్పుడు ఆ ప్రతిపాదనల్లో మూడో ప్రాధాన్యంగా ఇచ్చిన “తెలంగాణ రక్షణ సేన” పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమిక ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ పేరుపై ప్రజల అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తెలియజేయాలని ఈసీ సూచించింది. రెండు జాతీయ, రెండు స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. అభ్యంతరాలు వచ్చిన పక్షంలో కవిత తరఫున వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ పరిణామంపై స్పందించిన కవిత సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “టిఆర్ఎస్ నాకు రాసి పెట్టిందేమో” అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ, సాంస్కృతిక పునరుజ్జీవన లక్ష్యాలతోనే పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తానని తెలిపారు.
అయితే అసలు చర్చ అంతా “తెలంగాణ రాష్ట్ర సేన” పేరు ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానిపైనే సాగుతోంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన పేర్ల జాబితాలో ఆ పేరు లేకపోయినా, సభలో మాత్రం అదే పేరును ప్రకటించడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారితీసింది. ఒకవైపు “తెలంగాణ రక్షణ సేన”కు ఈసీ స్పందిస్తుండగా, మరోవైపు కవిత మాత్రం “టిఆర్ఎస్” బ్రాండ్‌ను రాజకీయంగా కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా భారత్ రాష్ట్ర సమితి వర్గాల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. కావాలనే పాత “టిఆర్ఎస్” పేరును పోలిన విధంగా కొత్త పార్టీ పేర్లు తీసుకొస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కవితను ఇకపై కుటుంబ రాజకీయ కోణంలో కాకుండా ప్రత్యర్థి రాజకీయ శక్తిగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు.

