ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. నోటీసులు అంటేనే అరెస్ట్ అన్నట్లుగా కొందరు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా, వాస్తవ పరిస్థితి అంత తీవ్రమైనది కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చట్టం ప్రకారం 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలవాల్సిన అవసరం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం, అలాంటి వ్యక్తిని ఆయన నివాసంలోనే విచారించాలి. ఇదే విషయాన్ని కేసీఆర్ తన లేఖలో స్పష్టంగా పేర్కొంటూ, విచారణకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్న కారణంగా మరో తేదీ ఇవ్వాలని సిట్‌ను కోరారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం చేయడం పూర్తిగా రాజకీయ దుష్ప్రచారమేనని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్‌కు తెలంగాణలో ఉన్న ప్రజాధారణ, ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఉన్న మద్దతును దృష్టిలో ఉంచుకుంటే, అలాంటి చర్యలు రాజకీయంగా భారీ ప్రతిచర్యలకు దారి తీసే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇక విచారణ పేరుతో జరుగుతున్న షో ఆఫ్ కూడా చర్చనీయాంశంగా మారింది. నోటీసులకు స్పందిస్తూ విచారణకు సహకరించడం సహజమే కానీ, భారీ జన సమీకరణలు, జేజేలు కొట్టడం వంటివి మరీ ఓవర్‌గా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేని కొందరు నేతల కోసం ఇంత హడావిడి ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొత్తంగా చూస్తే, కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం చట్టపరమైన ప్రక్రియలో భాగమే తప్ప, తక్షణ అరెస్టుల దిశగా వ్యవహారం వెళ్తుందని నమ్మేందుకు బలమైన ఆధారాలు లేవు. రాజకీయ లాభనష్టాల మధ్య సాగుతున్న ఈ వ్యవహారాన్ని ప్రజలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు.

