ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, అందుకే మురికి భాషతో విషప్రచారానికి దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా తిరస్కరిస్తున్న తీరు రాజ్యాంగానికే సవాల్‌గా మారిందని కేటీఆర్ అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు ప్రజల కళ్ల ముందే ఉన్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్‌ను కొట్టివేయడం అర్థరహితమని మండిపడ్డారు.
ఒకవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్వయంగా తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీశారని కేటీఆర్ ఆరోపించారు. స్పీకర్ తీర్పును న్యాయస్థానంలో సవాల్ చేస్తామని తెలిపారు.
ఇదే సమయంలో కేఎల్ఎస్ఆర్ అనే దివాల తీసిన కంపెనీకి రేవంత్ రెడ్డి హయాంలో అమృత్ స్కీమ్, జలజీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల పనులు కలిపి దాదాపు 6000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎలా వచ్చాయో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు
దివాల తీసిన కంపెనీల్లో కొనసాగుతున్న వందల కోట్ల ఆర్థిక లావాదేవీలపై నిక్కచ్చిగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఇటీవల ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. తన బినామీ కంపెనీల అక్రమాలు బయటపడతాయనే భయంతోనే దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి సిట్ విచారణ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్ర ప్రజల దృష్టిని అక్రమాల నుంచి మళ్లించేందుకే తనతో పాటు కేసీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులకు సిట్ నోటీసుల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టును వెంటనే రద్దు చేసి, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.

