మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ అవసరమా?పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వచ్చి ప్రచారం చేస్తేనే గెలుపా? – మహేష్ కుమార్ గౌడు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లు బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ–జనసేన అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, అయితే పవన్ పర్యటన తేదీలు, పర్యటించే మున్సిపాలిటీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పార్టీ నేతలు తెలిపారు.

రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఎన్నికల్లో మద్దతు కోరిన విషయం తెలిసిందే. బీజేపీ గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని పవన్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ పరిణామాలపై టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడు తీవ్ర విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వచ్చి ప్రచారం చేస్తే గానీ తెలంగాణలో బీజేపీకి గెలిచే పరిస్థితి లేదా? అని ప్రశ్నించారు. స్వతహాగా పోటీ చేసి గెలిచే స్థితి బీజేపీకి లేదని అర్థమైపోయి అలయన్స్ రాజకీయాలకు వెళ్లిందని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ ప్రజల భాష, నడవడికపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆయనను ‘తెలంగాణ వ్యతిరేకి’గా అభివర్ణించారు. బీజేపీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు వెళ్లి పవన్ వద్ద ఓట్లు అడిగే స్థితికి దిగజారడం దురదృష్టకరమని అన్నారు. పవన్ లాంటి ఆంధ్రా నేత వచ్చి అడిగితే తప్ప తెలంగాణలో బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పాలనకు ప్రజల మద్దతు పెరుగుతున్న భయంతోనే బీజేపీ సినీ తారల చుట్టూ తిరుగుతోందని మహేష్ కుమార్ గౌడు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ‘గుండు సున్నా’ వచ్చే అవకాశం ఉందని, మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. జాతీయ నేతల రాక కూడా అదే వ్యూహంలో భాగమని పేర్కొన్నారు.

బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాల నుంచి నేతలను తీసుకువచ్చి ప్రచారం చేయించాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చిందంటే, తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *