మాజీ మంత్రి కేటీఆర్‌ను సిట్ అధికారులు విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రెస్మీట్లు పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆధారాలతో పలువురు అధికారులను నిందితులుగా గుర్తించి జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు—సిట్ విచారణ ఎదురైన ప్రతీసారి వీరు జైతయాత్రకు వెళ్లినట్లుగా ప్రెస్మీట్లు పెట్టి, స్వయంగా డబ్బాలు కొట్టుకుంటూ తెలంగాణ ప్రజల్లో సానుభూతి సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిన్న హరీష్ రావును పిలిస్తే ఒక డ్రామా, ఈరోజు కేటీఆర్‌ను పిలిస్తే అదే తరహా డ్రామా జరుగుతోందని ఆరోపించారు. ఈ బావ–బామర్దుల పోటీ రాజకీయ సానుభూతి కోసమేనని వ్యాఖ్యానించారు.
తమ పాలన సమయంలో ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడి, ప్రతిపక్షాల గొంతు నొక్కారని, ఉపఎన్నికల పేరుతో అనేక అక్రమాలు జరిగాయని సిట్ ఇప్పటికే నిర్ధారించిందని తెలిపారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతయ్య వంటి అధికారులు జైలుకు వెళ్లిన తర్వాత, శ్రవణ్ కుమార్, నవీన్ రావుల విచారణలో ఈ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల పాత్ర బయటపడిందని చెప్పారు.
అయినా కూడా సిట్ ముందు నిజాలు చెప్పకుండా, విచారణను రాజకీయ కక్షగా చిత్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పష్టంగా మాట్లాడకుండా, సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతీసారి కొత్త అంశాన్ని తెరపైకి తెస్తారని, హిల్ట్ ప్రాజెక్ట్, గ్రూప్–1, సింగరేని, కోల్ మైనింగ్ అంటూ మాట మార్చడం వీరి డైవర్షన్ రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. విచారణ వస్తే కొత్త దుకాణం తెరవడం వీరి అలవాటుగా మారిందన్నారు.
తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కేటీఆర్ మాట్లాడే ప్రతి మాటను, హరీష్ రావు చేసే ప్రతి ప్రకటనను సమాజం జాగ్రత్తగా పరిశీలిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పెంచే విధంగా పాలన సాగిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
చివరిగా, తమపై వచ్చిన ఆరోపణలను నాటకాలతో కాదు, చట్టపరంగా ఎదుర్కోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలని, తప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. తెలంగాణ ప్రజలు ఈ సానుభూతి డ్రామాలను నమ్మరని, భవిష్యత్తుపై అతి ఊహలు అవసరం లేదని స్పష్టంగా తెలిపారు.

