ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు: ట్రెండింగ్ టాపిక్‌లకే పరిమితమైన తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు చేసిన ఆయన, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణ సీరియల్‌లా అంతం లేకుండా సాగుతోందని, అసలు కారకులను అరెస్ట్ చేయకుండా విచారణ పేరుతో వాంగ్మూలాలు మాత్రమే నమోదు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వేడిని మరింత పెంచింది.

ఇది కొత్త విషయం కాదు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, కార్ రేస్ వ్యవహారం, గొర్రెల స్కామ్, పేపర్ లీకేజ్, కరెంట్ అవకతవకలు వంటి అనేక అంశాలు కూడా ఇదే విధంగా ట్రెండింగ్ టాపిక్‌లుగా మారాయి. ప్రతి అంశం బయటకు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసాయి. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ అంశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. విచారణల పురోగతి ఏమైందో ప్రజలకు ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొంది.

బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోలేకపోతున్నదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో కాలయాపన చేస్తోందన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం తమను ఎవరూ టచ్ చేయలేరన్న ధీమాతో స్పందిస్తోంది.

మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మిగతా కేసుల్లానే రాజకీయ పంచాయతీగా మారిందన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది. న్యాయం సాధించడంకంటే, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి రోజుకో కారణం వెతుక్కోవడమే రాజకీయ పార్టీల లక్ష్యంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *