మైక్రోఫైనాన్స్ పేరుతో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ప్రముఖ గాయని మంగళి స్పష్టం చేశారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆరోపణలు నిరూపిస్తే ఎక్కడైనా హాజరుకావడానికి సిద్ధమని తెలిపారు.
తన పేరు ఉపయోగించి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నప్పటికీ, తనకు వాటితో సంబంధం లేదని ఆమె వెల్లడించారు. “నిజంగా నేను ఇన్వాల్వ్ అయితే ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు వెళ్లడానికి సిద్ధం. కానీ ఫేక్ ఆరోపణలు చేస్తే వాళ్లు ఏం చేస్తారు?” అని మీడియాను ప్రశ్నించారు.
మంగళి మాట్లాడుతూ, ఒక గిరిజన ఆడబిడ్డగా 14 సంవత్సరాలుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఇలాంటి ఆరోపణలు తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఫేమస్ కావడానికి తన పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో అడ్వకేట్ సుబ్బుపై ఇప్పటికే డిఫమేషన్ కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
మంగళి తరఫు న్యాయవాది మాట్లాడుతూ, 2025లోనే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ప్రస్తుతం సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. మంగళికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోవడంతోనే పోలీసులు ఆమెను ప్రశ్నించలేదని స్పష్టం చేశారు.
ఇటీవల సుబ్బు తనపై 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, సోషల్ మీడియా వీడియోలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని మంగళి ఆరోపించారు. దీనిపై ఎక్స్టోర్షన్ కేసు కూడా పెట్టినట్లు తెలిపారు.
మంగళి మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తూ, నిజాలు తెలుసుకుని వార్తలు ప్రచారం చేయాలని, తప్పుడు ప్రచారాలతో ఒక ఆడబిడ్డ జీవితం దెబ్బతీయవద్దని కోరారు.
“నాలో ఒక్క శాతం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. దయచేసి నన్ను అనవసరంగా బ్లేమ్ చేయకండి” అని ఆమె స్పష్టం చేశారు.

