బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన తరఫున ప్రత్యేకంగా చెప్పాలని బిఆర్ఎస్ ఎంపీలకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దిక్కొండ దామోదర్ రావు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అభివృద్ధి అంశాలపై ప్రధానికి వినతిపత్రాలు సమర్పించారు.
సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే 365బీని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని ఎంపీలు మోదీని కోరారు. ఈ అంశాన్ని ఇప్పటికే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ప్రధానికి గుర్తు చేశారు. రహదారి విస్తరణపై కేంద్ర మంత్రి ఇప్పటికే అధికారికంగా హామీ ఇచ్చిన అంశాన్ని కూడా వివరించారు. ఈ రహదారి పూర్తయితే ఆ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
అలాగే ధవలేశ్వరం బ్రిడ్జ్ తరహాలో మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించి, వేములవాడ మీదుగా కోరుట్లలోని జాతీయ రహదారి 63తో అనుసంధానం చేయాలని కోరారు. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా కలిపే మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా మిగిలిన పనులకూ సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలోనూ మోదీ కేసీఆర్ గురించి ఆరా తీసి, తన మాటగా కేసీఆర్‌కు చెప్పాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.
ముఖ్యంగా కేసీఆర్–బీజేపీ మధ్య భవిష్యత్తులో పొత్తు ఉండే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌తో బీజేపీకి పొత్తు సాధ్యంకాని పరిస్థితుల్లో, ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్లే వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేనతో బీజేపీ కలిసి వెళ్లిన తరహాలోనే తెలంగాణలోనూ బిఆర్ఎస్‌తో కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉందా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి.
ఇటీవల నెలలుగా ప్రజా సమస్యలపై బహిరంగంగా స్పందించని కేసీఆర్, ఇప్పుడు హఠాత్తుగా బయటికి రావడం కూడా ఈ చర్చలకు మరింత బలం ఇస్తోంది. ఇది కేవలం అంతర్గత పార్టీ సమావేశమా? లేక బీజేపీతో భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ అంశంపై ఇప్పుడే క్లారిటీ ఇస్తారా? లేక రెండు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలకు ముందు స్పష్టమైన సంకేతం ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే కేసీఆర్ ఆరోగ్యంపై మోదీ ఆరా తీసిన ఘటన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంకేతాలుగా భావించబడుతోంది.

