తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, సేవలను పార్టీ రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి నేత స్పష్టం చేశారు. గత సంవత్సరం విచార కిరీటం పుస్తకం చదివిన సందర్భంగా, తాను అప్పట్లో బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఉద్యమకారుల జయంతిని సామాజిక మాధ్యమాల్లో గుర్తు చేసుకున్నానని తెలిపారు.
ఎవరు ఏ పార్టీలో ఉన్నారన్నది ముఖ్యం కాదని, తెలంగాణ ఫస్ట్ అనే విధానంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి గొప్పతనాన్ని గుర్తించాల్సిందేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ముచ్చర్ల సత్యనారాయణ లాంటి ఉద్యమకారులు విస్మరణకు గురవడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు.
రవీంద్రభారతిలో అనేక సందర్భాల్లో తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటికీ ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఇతర ప్రాంతాల విగ్రహాలు తొలగించాలన్న ఉద్దేశం లేదని, కానీ తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన వారి విగ్రహాలు తప్పకుండా ట్యాంక్ బండ్‌పై ఉండాలని స్పష్టం చేశారు. ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరజ్యోతి పరిస్థితిపై కూడా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో అవినీతి ఆరోపణలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమరజ్యోతిని గౌరవించకపోవడం విచారకరమన్నారు. భవిష్యత్తులో తెలంగాణ జాగృతికి అధికారం వస్తే, తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతులను అధికారికంగా అమరజ్యోతిలో నిర్వహిస్తామని తెలిపారు.
అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమ చరిత్రకు కేంద్ర బిందువుగా మార్చి, పెద్ద లైబ్రరీతో పాటు ఒక వార్ రూమ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విద్యార్థులను అక్కడికి తీసుకొచ్చి తెలంగాణ కోసం జరిగిన త్యాగాలను వివరించి, ఉద్యమకారుల చరిత్రను చిరస్థాయిగా నిలిపే ప్రయత్నం చేస్తామని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లడం అన్యాయమని ఆమె ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అన్యాయం మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతోందని విమర్శించారు. బీసీలు తమ హక్కులు అడగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులు, విచారణలు తెరపైకి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.
42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే అది బీసీలను మోసం చేసినట్టేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకపోతే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా అభ్యర్థులకు తెలంగాణ జాగృతి తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.
యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ, మున్సిపల్ ఎన్నికలను రాజకీయ శిక్షణా వేదికగా వినియోగించుకోవాలని సూచించారు. గెలుపు–ఓటమి కంటే రాజకీయ అనుభవమే ముఖ్యమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనలో బీసీల సంఖ్య సరిగ్గా నమోదయ్యేలా తెలంగాణ జాగృతి సమగ్ర అధ్యయనం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని తెలిపారు. ముచ్చర్ల సత్యనారాయణ గారి స్ఫూర్తితో తెలంగాణ బహుజనుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

