మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పోలింగ్ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయడంతో మున్సిపల్ ఎన్నికల నగారా మోగినట్టైంది. అయితే, గత సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హింస, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి.
ఇటీవల బాసర ప్రాంతానికి చెందిన ఓ పురోహితుడిపై దాడి జరిగిందని, తన కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉందని బాధితుడు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీడియోలు, సందేశాలు పంపిన అనంతరం బెదిరింపుల కారణంగా వాటిని తొలగించినట్టు పేర్కొన్నారు. పురోహితుడిపై దాడి ఘటనను తేలికగా తీసుకోకూడదని, ఇలాంటి ఘటనలు మున్సిపల్ ఎన్నికల సమయంలో మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
స్థానికంగా భూకబ్జాలు, రాజకీయ ఆధిపత్య పోరాటాల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఎక్స్ సర్పంచ్ కుటుంబానికి చెందిన వ్యక్తులు తమ ప్రభావాన్ని ఉపయోగించి పురోహితుడిని బెదిరించారని, దాడి చేసినా పోలీసులు చిన్న కేసు మాత్రమే నమోదు చేశారని విమర్శలు వచ్చాయి. దాడి తీవ్రతకు సరిపడని చర్యలు తీసుకోవడం అన్యాయమని, పోలీస్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ, ఇంటెలిజెన్స్ విభాగం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, అలాగే దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించాలని డిమాండ్ చేశారు. పురోహితులపై దాడులు జరగడం అత్యంత దారుణమని, అమ్మవారి సేవలో ఉన్న వారిని కూడా రక్షించలేని పరిస్థితి ఏర్పడితే అది పాలనా వైఫల్యమేనని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, బాసర ట్రిపుల్ ఐటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి హాజరుకాకుండానే జీతాలు పొందుతున్నారనే ఆరోపణలపై కూడా విచారణ జరపాలని కోరారు. సాధారణ ఉద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వం, రాజకీయ ప్రభావం ఉన్నవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
మొత్తంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పురోహితులు, బలహీన వర్గాల భద్రతకు భరోసా ఇవ్వాలని ఈ ఘటన మరోసారి అవసరాన్ని గుర్తు చేస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

